UN: రెండేళ్లలో భారత్ లో నీటికి కటకట: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

UN predicts groundwater level in India will reduce to low by 2025
  • కీలకమైన టిప్పింగ్ పాయింట్ కు దిగువకు భూగర్భ జలాలు
  • 2025 నాటికి పడిపోతాయని ఐక్యరాజ్య సమితిహెచ్చరిక
  • ఒక్కసారి ఇది ఏర్పడితే తిరిగి కోలుకోవడం కష్టమని విశ్లేషణ
భారత్ లో నీటికి కటకట తప్పదా..? ఐక్యరాజ్యసమితి ఇదే విషయమై హెచ్చరిస్తోంది. భారత్ లోని ఇండో-గ్యాంగెటిక్ బేసిన్ పరిధిలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. భారత్ లోని వాయవ్య రాష్ట్రాల్లో 2025 నాటికి భూగర్భ జలాలు అత్యంత కనిష్ఠ స్థాయికి (కీలక స్థాయికి దిగువకు) పడిపోతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. వచ్చే నెలలో వాతావరణంపై జరిగే కీలక కాప్28 సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసింది.

అధిక వేడి వాతావరణం, కరవు కారణంగా భూగర్భ జలాలపై ఆధారపడడం పెరుగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రస్తావించింది. మంచు పర్వతాలు కరిగిపోతే అప్పుడు నీటికి కటకట ఏర్పడుతుందని తెలిపింది. వాతావరణంలో మార్పులతో మంచు పర్వతాలు కరుగుతాయని, దీనివల్ల నదుల్లో నీరు నిండలేని, భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొంది. ప్రధానంగా వాతావరణ మార్పులతో సౌదీ అరేబియా, భారత్, యూఎస్ అధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 

పర్యావరణం పరంగా  కీలక స్థాయుల దిగువకు నీటి పరిమాణం పడిపోతే అక్కడి నుంచి పూర్వ స్థితికి చేరడం అసాధ్యంగా పేర్కొంది. బూగర్భ జలాల్లో 70 శాతాన్ని వ్యవసాయ అవసరాల కోసమే వాడతుండడాన్ని ప్రస్తావించింది. భూమిపై నీటి ప్రవాహాలు తగినంత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని గుర్తు చేసింది. భూగర్భ జలాలు పడిపోతే, అప్పుడు వాటిని రైతులు పొందలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది మొత్తం ఆహారోత్పత్తిపైనే ప్రభావం పడేలా చేస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే సౌదీ అరేబియాలో కీలకమైన టిప్పింగ్ పాయింట్ కు దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయని చెబుతూ.. భారత్ సైతం దీనికి మరీ దూరంలో లేదని తెలిపింది. ప్రపంచంలో భూగర్భ జలాలను అధికంగా వినియోగించే భారత్, ఈ విషయంలో అమెరికా, చైనాలను వెనక్కి నెట్టేసింది.
UN
groundwater
India
reduced

More Telugu News