England: ఇంగ్లండ్ కు చావో రేవో.. నేడు గెలిస్తేనే ముందుకు

  • పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్
  • ఒక మెట్టుపైనున్న శ్రీలంక టీమ్
  • రెండింటికీ ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకమే
  • సెమీ ఫైనల్ కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిందే
England vs Sri Lanka World Cup 2023 Match 25 head to head neck to neck

వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో కీలకమైన పోరు జరగనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లూ ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్ లు ఆడి, ఒక్కో విజయంతో కింది నుంచి మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. 


2019 వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లండ్ ఈ విడత గడ్డు పరిస్థితులను చూస్తోంది. అభిమానులు కూడా టోర్నమెంట్ కు ముందు ఇంగ్లండ్ నుంచి ఈ తరహా చెత్త ప్రదర్శన ఉంటుందని ఊహించలేదు. గ్రూప్ దశలో ఆడిన నాలుగింటిలో మూడు ఓటములు చవిచూసిన ఈ రెండు జట్లకు, మిగిలిన ఐదు మ్యాచ్ లు కీలకం కానున్నాయి. 

భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవి పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్నాయి. దాదాపు సెమీ ఫైనల్స్ కు ఈ నాలుగు జట్లు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలస్యంగా అయినా ఆస్ట్రేలియా కుదురుకుని, ఫామ్ లోకి వచ్చేసింది. కనుక మిగిలిన అన్ని మ్యాచ్ లలో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తే తప్ప ఇంగ్లండ్, శ్రీలంక సెమీ ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఈ జట్లకు చావో రేవో అన్నట్టుగానే సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. 

మరీ దారుణమైన విషయం ఏమిటంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్, ఈ విడత పాయింట్ల పట్టికలో పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, శ్రీలంక కంటే దిగువ స్థానంలో ఉండడం. మరి ఇంగ్లండ్ ఇకనైనా పోరాట పటిమ చూపిస్తుందా? లేక పరాభవంతో నిష్క్రమిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.

More Telugu News