vivek: పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వివేక్ వెంకటస్వామి

Former MP Vivek responds on Party change
  • హైదరాబాద్‌లో అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ
  • తాను పార్టీ మారుతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందన్న వివేక్
  • కానీ అదంతా తప్పని... వట్టి ప్రచారమేనని స్పష్టీకరణ
  • పెద్దపల్లి నుంచి లోక్ సభకు బీజేపీ నుంచే పోటీ చేస్తానన్న వివేక్
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీని వీడుతారనే ప్రచారం గత కొన్నిరోజులుగా సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో వివేక్ రాజీనామాపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా ప్రచారంపై స్పందించారు.

తాను పార్టీ మారుతానంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అదంతా వట్టి ప్రచారమే అన్నారు. తాను రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశంపై స్పందిస్తూ... ఆ విషయం తనకైతే తెలియదన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు.

వారం రోజుల పాటు వ్యక్తిగత పర్యటనపై వెళ్లిన వివేక్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అవుతారని, ఆ తర్వాత ఇరువురు కలిసి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే వివేక్ మాత్రం తాను పార్టీలోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
vivek
BJP
Congress
Telangana Assembly Election

More Telugu News