Indian American: ఇద్దరు భారతీయ అమెరికన్లకు అత్యున్నత అవార్డులు

Two Indian American scientists awarded United States highest scientific honour
  • అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ సేవలకు గుర్తింపు
  • నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుల బహూకరణ
  • ఇద్దరూ ముంబైకి చెందిన వారే

అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్ పురస్కారం ఇద్దరు భారతీయ అమెరికన్లను వరించింది. అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ లకు ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు. ఈ కార్యక్రమం మంగళవారం జరిగింది. 


అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సుస్థిరాభివృద్ధిపై ఎన్నో ఆవిష్కరణలకు గాడ్గిల్ కృషి చేశారు. శుద్ధ జలం, ఇంధన సామర్థ్యం, మెరుగైన శుభ్రత కోసం సమర్థవంతమైన సాంకేతికతల అభివృద్ధిపై గాడ్గిల్ కృషి చేస్తున్నారు. గాడ్గిల్ ముంబైలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫిజిక్స్ లో పట్టా పొందారు. ఐఐటీ కాన్పూర్ లో పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా (బెర్క్ లే) నుంచి ఎంఎస్ సీ, పీహెచ్ డీ పట్టాలు పొందారు.

ఇక సుబ్ర సురేష్ బయో ఇంజనీర్, మెటీరియల్ సైంటిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డీన్. గౌరవ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్ లో ఆయన అధ్యయనాలు చేస్తుంటారు. ముంబైలో జన్మించిన సురేష్ ఐఐటీ, మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ, మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టా పొందారు. సాంకేతిక రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డులను ఏటా అందిస్తుంటారు. 

  • Loading...

More Telugu News