Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ బీజేపీకి మరో షాక్.. సొంతగూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy Quitting BJP And Ready To Join In Congress
  • బీజేపీలో ముగిసిన రాజగోపాల్ 15 నెలల ప్రస్థానం
  • బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయిందన్న నేత
  • కేసీఆర్ చెర నుంచి రాష్ట్రాన్ని విడిపించాలన్న ఆశయంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటన
బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్థానం ముగిసింది. తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు వెళ్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్న తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారిన బీజేపీ ఇప్పుడు డీలా పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్నామ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్టు వివరించారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కినుక వహించిన రాజగోపాల్‌రెడ్డి 15 నెలల క్రితం మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిరుడు అక్టోబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడం, కాంగ్రెస్ బలం పెరుగుతుండడంతో ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. నియంత కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్న తనను ప్రజలు ఆదరించాలని కోరుతూ ఓ లేఖ విడుదల చేశారు.
Komatireddy Raj Gopal Reddy
Congress
BJP
Telangana

More Telugu News