Ranbir Kapoor: కొంత కాలం సినిమాలకు దూరం కానున్న రణబీర్ కపూర్

Ranbir Kapoor to take 6 months break from acting Can you guess why
  • 5-6 నెలల పాటు విరామం ప్రకటించిన రణబీర్
  • కుమార్తె రాహాతో సమయం వెచ్చించాలని నిర్ణయం
  • యానిమల్ తర్వాత ఇతర సినిమాలకు ఓకే చెప్పలేనని వెల్లడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సినిమాలకు విరామం చెప్పాడు. తన కుమార్తె రాహాతో గడిపేందుకు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రణబీర్ కపూర్ నిర్ణయించుకున్నాడు. జూమ్ ద్వారా రణబీర్ తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగానే ఈ విషయాన్ని వెల్లడించాడు. యానిమల్ సినిమా తర్వాత తాను ఏ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేదన్నాడు. 

రణబీర్ కపూర్, అలియా భట్ 2022 ఏప్రిల్ లో వివాహం చేసుకోగా, వీరికి అదే ఏడాది నవంబర్ 6న సంతానం కలిగింది. వచ్చే నెలలోనే రాహా మొదటి పుట్టిన రోజు జరుపుకోనుంది. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నందున తన కుమార్తెతో ఇప్పటి వరకు పెద్దగా సమయం గడపలేకపోయినట్టు రణబీర్ వెల్లడించాడు. అందుకే ఇప్పుడు 5-6 నెలల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండి, కుమార్తెతో సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు రణబీర్ కపూర్ తెలిపాడు. 

తాను సరైన సమయంలో బ్రేక్ తీసుకున్నట్టు చెప్పాడు. రాహ ఇప్పుడు చాలా బాగా భావ వ్యక్తీకరణ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. బాగా గుర్తు పడుతోందని, ఎంతో ప్రేమ కురిపిస్తోందన్నాడు. ప, మ అనే పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోందని, ఆమెతో గడపడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు రణబీర్ కపూర్ వివరించాడు. మరోవైపు అలియా భట్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. దీంతో రాహాకు ఇద్దరూ దూరం కాకూడదనే రణబీర్ ఇలా చేసి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రణబీర్ నటించిన యానిమల్ సినిమా త్వరలో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News