Fawad Ahmed: ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. ఆ జట్టు మాజీ స్పిన్నర్ ఫవాద్ నాలుగు నెలల కుమారుడి మృతి

Australian Cricketer Fawad Ahmed 4 Month Old Son Died
  • ఈ ఏడాది జూన్‌లోనే జననం
  • పుట్టినప్పటి నుంచీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారి
  • సుదీర్ఘ పోరాటం తర్వాత కఠినమైన పోరాటంలో ఓడిపోయాడంటూ ఫవాద్ ఆవేదన
ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. మాజీ స్పిన్నర్ ఫవాద్ అహ్మద్ నాలుగు నెలల కుమారుడు మరణించాడు. ఈ ఏడాది జూన్ నెలలో రెండో సంతానంగా జన్మించిన ఈ చిన్నారి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మెల్‌బోర్న్‌లోని రాయల్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు ఈ నెల 23న మృతి చెందినట్టు ఫవాద్ తెలిపాడు. 

సుదీర్ఘ పోరాటం తర్వాత బాధాకరమైన, కఠినమైన పోరాటంలో తన చిన్నారి దేవదూత ఓడిపోయాడంటూ ఎక్స్‌ ద్వారా తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదన్న ఫవాద్.. తమ కోసం ప్రార్థించాలని కోరుతూ చిన్నారి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రెండు ఫొటోలను షేర్ చేశాడు.

ఫవాద్ కుమారుడి మృతిపై ఆసీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. తమ ఆలోచనలు ఆ చిన్నారి చుట్టూనే ఉన్నాయని పేర్కొంది. ఈ కష్ట సమయంలో ఫవాద్, ఆయన కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపింది. ఫవాద్ ప్రస్తుతం విక్టోరియా తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో ఇటీవల మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా తరపున 2013లో ఐదు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.
Fawad Ahmed
Australia
Fawad Ahmed Son
Cricket Australia

More Telugu News