Mohammed Shami: వచ్చాడు... వికెట్ తీశాడు!

Shami takes wicket after his return into Team India
  • ఇవాళ వరల్డ్ కప్ లో టీమిండియా × న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేసిన కివీస్
  • ఓపెనర్ విల్ యంగ్ ను అవుట్ చేసిన షమీ
  • షమీ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర క్యాచ్ డ్రాప్ చేసిన జడేజా
వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. వికెట్ టేకింగ్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ షమీకి ఒక్క మ్యాచ్ లోనూ అవకాశం ఇవ్వకపోవడం విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏమంతగా రాణించని శార్దూల్ ఠాకూర్ కు వరుసగా అవకాశాలు ఇస్తుండడంతో మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని బాహాటంగా ప్రశ్నించారు. 

అయితే, ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా నుంచి శార్దూల్ ఠాకూర్ ను తప్పించి మహ్మద్ షమీని ఎంపిక చేశారు. షమీ బౌలింగ్ కు వచ్చీ రావడంతోనే తొలి బంతికే వికెట్ తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఓ చక్కని ఇన్ కట్టర్ డెలివరీతో కివీస్ ఓపెనర్ విల్ యంగ్ ను బౌల్డ్ చేశాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన యంగ్ లోపలికి కట్ అయిన ఆ బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ తర్వాత ప్రమాదకర రచిన్ రవీంద్ర వికెట్ కూడా షమీకి దక్కేదే... కానీ ఎంతో ఈజీగా క్యాచ్ ను రవీంద్ర జడేజా నేలపాలు చేశాడు. 

ప్రస్తుతం ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 91 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 39, డారిల్ మిచెల్ 31 పరుగులతో ఆడుతున్నారు. 

కాగా, వేలికి గాయం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానాన్ని వీడడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రోహిత్ గాయం తీవ్రమైనది అయితే పరిస్థితి ఏంటన్న చర్చ జరిగింది. అయితే, కాసేపటి తర్వాత రోహిత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం టీమిండియాలో అందరికంటే భీకర ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
Mohammed Shami
Wicket
Team India
New Zealand
Dharmashala
World Cup

More Telugu News