South Africa: ముంబయి వాంఖెడే స్టేడియంలో ఫోర్లు, సిక్సుల వర్షం.... దక్షిణాఫ్రికా 399-7

South Africans hammers England bowling in Wankhede stadium
  • వరల్డ్ కప్ లో ఇవాళ ఇంగ్లండ్  వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • శివాలెత్తిన సఫారీ బ్యాటర్లు
  • క్లాసెన్ వీర మాస్ సెంచరీ... యన్ సెన్ విధ్వంసక అర్ధసెంచరీ
  • బ్యాట్ పవర్ చూపించిన హెండ్రిక్స్, డుస్సెన్, మార్ క్రమ్
ముంబయి వాంఖెడే స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. వరల్డ్ కప్ లో ఇవాళ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతుండగా... దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటర్ల విధ్వంసంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. 

ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందన్న మాటే గానీ, వారి బౌలింగ్ లో ఎక్కడా ఊపు, ఉత్సాహం కనిపించలేదు. ఇంగ్లండ్ బౌలింగ్ ను సఫారీ బ్యాటర్లు చీల్చిచెండాడారు అంటే సరిగ్గా సరిపోతుంది.

ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) వికెట్ ను ఆదిలోన పడగొట్టామన్న సంబరం తప్పితే, ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కష్టాలు అన్నీఇన్నీ కావు. సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ తో మొదలుపెడితే, చివర్లో మార్కో యన్ సెన్ వరకు ఉతికారేశారు. మధ్యలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ వీర మాస్ సెంచరీ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. క్లాసెన్ 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేయడం విశేషం. 

అంతకుముందు, కెప్టెన్ టెంబా బవుమా స్థానంలో జట్టులోకి వచ్చిన రీజా హెండ్రిక్స్ 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 85 పరుగులు చేశాడు. వాన్ డర్ డుస్సెన్ 60, తాత్కాలిక సారథి ఐడెన్ మార్ క్రమ్ 42 పరుగులతో స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. చివర్లో మార్కో యన్ సెన్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి మెరుపు అర్ధశతకం నమోదు చేశాడు. యన్ సెన్ 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరు 3 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే ఇంగ్లండ్ బౌలింగ్ ను ఎలా చితక్కొట్టాడో అర్థమవుతుంది. 

ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3, గస్ ఆట్కిన్సన్ 2, అదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. ఇవాళ్టి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విజృంభణ చూస్తే... మొన్న నెదర్లాండ్స్ పై 246 పరుగుల టార్గెట్ కొట్టలేకపోయిన జట్టు ఇదేనా...? అనిపించింది.
South Africa
England
Wankhede Stadium
Mumbai
ICC World Cup

More Telugu News