Rahul Gandhi: మీతో నాకున్నది కుటుంబ అనుబంధం: రాహుల్ గాంధీ

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం
  • నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • తెలంగాణలో బీజేపీ పనైపోయిందని వెల్లడి
  • బీజేపీ నేతలు కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారని వ్యాఖ్యలు
Rahul Gandhi attends Mortad rally in Nizamabad district

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు. ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దాం అని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. 

ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయని... అసోం, రాజస్థాన్, మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు.  

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు.

More Telugu News