USA: శ్వేతసౌధం భారీ తప్పిదం.. విమర్శలు చెలరేగడంతో బైడెన్ సైనికులతో దిగిన పొటో తొలగింపు

White House Deletes Biden Photo With US Troops In Israel After Backlash
  • ఇజ్రాయెల్‌లో యూఎస్ సైనికులతో ఫొటో దిగిన అమెరికా అధ్యక్షుడు  
  • ఫొటోలో సైనికుల ఫొటోలు బ్లర్ చేయకుండానే నెట్టింట పోస్ట్ చేసిన శ్వేతసౌధం
  • సైనికుల జీవితాలను ప్రమాదంలో పడేశారంటూ బైడెన్‌పై విమర్శలు
  • వెంటనే ఫొటోలను తొలగించిన శ్వేతసౌధం
ఇజ్రెయెల్‌లోని అమెరికా సైనికులతో కలిసి అధ్యక్షుడు బైడెన్ దిగిన ఫొటోను షేర్ చేసిన శ్వేతసౌధం తాజాగా భారీ కలకలానికి తెరలేపింది. ఫొటోలోని సైనికుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ‘‘హమాస్ దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగి ధైర్యసాహసాలు ప్రదర్శించిన అమెరికా సైనికులకు అధ్యక్షుడు బైడెన్ ధన్యవాదాలు తెలిపారు’’ అంటూ ఫొటో కింద ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. అమెరికా అధ్యక్షుడి ఇజ్రయెల్ పర్యటన సందర్భంగా ఈ ఫొటోలు తీసినట్టు తెలుస్తోంది. అయితే, శత్రుమూకలతో పోరాడుతున్న సైనికుల వివరాలను బహిర్గతం చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారంటూ గురువారం బైడెన్ బృందంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో, వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన శ్వేత సౌధం ఆ ఫొటోలను డిలీట్ చేసింది. 

కాగా, ఈ ఉదంతంపై మీడియా వర్గాలు అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్‌ను ప్రశ్నలతో ముంచెత్తాయి. ఫొటోలో కనిపించిన సైనికులు అమెరికా ప్రత్యేక దళాలా? అని ప్రశ్నించాయి. ప్రత్యేక దళాలతో ఇలా ఫొటోలు దిగకూడదన్న విధానం అమల్లో ఉంది కదా? అని అడిగాయి. అయితే, ఇందుకు సంబంధించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని బ్రిగేడియర్ జనరల్ రైడర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో శ్వేతసౌధాన్ని సంప్రదించమని తేల్చి చెప్పారు.
USA
White House
Israel

More Telugu News