Virat Kohli: అలా జరుగుతుందనుకోలేదు.. జడేజాకి సారీ చెప్పిన విరాట్ కోహ్లీ!

Virat says sorry to Jadeja for Man of the match against Bangla Match
  • బంగ్లాపై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకుంటాననుకోలేదని వ్యాఖ్య
  • జడేజాకి అవార్డ్ దక్కుతుందని భావించినా.. కోహ్లీ సెంచరీతో దూరం
  • అలా జరిగిపోయిందంటూ విరాట్ వ్యాఖ్య
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి కింగ్ విరాట్ కోహ్లీ సారీ చెప్పాడు. 'అనుకోలేదు.. కానీ అలా జరిగిపోయింది.. సారీ' అని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఇంతకూ అసలేమైంది ? జడేజాకి కోహ్లీ సారీ చెప్పడానికి కారణం ఏంటి? అని తెగ ఆలోచించకండి. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు జరగలేదు. 

గురువారం రాత్రి బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతోపాటు రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకొని రెండు కీలకమైన వికెట్లు తీశాడు. రన్స్ కూడా తక్కువగానే ఇచ్చాడు. దీంతో రవీంద్ర జడేజాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కొచ్చేమో అనిపించింది. కానీ ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడిని వరించింది. దీంతో అవార్డ్ అందుకునే సమయంలో కోహ్లీ మాట్లాడుతూ జడేజాకి సారీ చెప్పాడు.

‘‘భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాలనుకున్నాను.. కానీ నీ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగేసుకుంటానని అనుకోలేదు’’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. సెంచరీ చేస్తానని అనుకోలేదని, కానీ అలా జరిగిపోయిందని అన్నాడు. ప్రపంచ కప్‌లలో అర్ధ సెంచరీలు చేస్తున్నానని, బంగ్లాపై మ్యాచ్‌లో చివరివరకు ఉండి సెంచరీ నమోదు చేశానని కోహ్లీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కాగా చివరివరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహల్‌కు బ్యాటింగ్‌ రాకుండా జాగ్రత్తగా ఆడాడు. కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ కూడా పూర్తిగా సహకరించాడు. కోహ్లీ క్రీజులో ఉండేలా సింగిల్స్ తీస్తూ సహకారం అందించాడు. దీంతో కోహ్లీ సునాయాసంగా సెంచరీ పూర్తి చేయగలిగాడు.
Virat Kohli
Ravindra Jadeja
Team India
Crime News

More Telugu News