Shubman Gill: ఇది గమనించారా?.. బంగ్లాపై బ్యాటింగ్ సమయంలో గిల్ ‘గోల్డెన్ బ్యాడ్జ్’ ఎందుకు ధరించాడు?

  • బంగ్లాపై మ్యాచ్‌లో గిల్ కాలర్ వద్ద కనిపించిన బ్యాడ్జ్
  • సెప్టెంబర్ నెల 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌'గా అందించిన ఐసీసీ
  • అద్భుత ప్రదర్శనకు దక్కిన అవార్డు
Why Subhman Gill weared golden badge against Bangla Match

గురువారం రాత్రి పూణె వేదికగా జరిగిన బంగ్లాపై మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. 257 పరుగుల లక్ష్య ఛేదనలో 53 పరుగులు కొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పిచ్‌పై చాలా సునాయాసంగా బ్యాటింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ ‘గోల్డెన్ బ్యాడ్జ్’ ధరించి బ్యాటింగ్ చేయడం కనిపించింది.  వెంటనే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఇంతకూ బంగ్లాపై మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ గోల్డెన్ బ్యాడ్జ్ ఎందుకు ధరించాడు? అనే సందేహం మీకు కూడా వచ్చిందా?.. అయితే ఈ వివరాలు మీకోసమే.

గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి టీషర్ట్ కాలర్‌ వద్ద ఈ గోల్డెన్ బ్యాడ్జ్ కనిపించింది. సెప్టెంబర్ 2023గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్’గా  ఈ గోల్డెన్ బ్యాడ్జ్‌ను ఐసీసీ అతడికి బహూకరించింది. అందుకే దానిని ధరించి బ్యాటింగ్ చేశాడు. సెప్టెంబర్ నెలలో అద్భుతమైన బ్యాటింగ్‌తో గిల్ ఈ అవార్డ్‌ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలలో కేవలం 8 ఇన్నింగ్స్‌లోనే గిల్ ఏకంగా 480 పరుగులు బాదాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్‌తోపాటు స్వదేశంలో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాణించాడు.

 కాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఆటగాడిగా గిల్ నిలిచాడు. తాజాగా లభించిన అవార్డుపై స్పందిస్తూ.. సెప్టెంబర్ నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నాడు. ఇండియా తరపున అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించాడు. తాను మరింత రాణించేందుకు, దేశాన్ని గర్వింపజేసేందుకు ఈ అవార్డు మరింత ప్రోత్సహిస్తుందని అన్నాడు.

More Telugu News