Ambati Rambabu: ములాఖత్‍‌లో అమాయకుడైన బాలకృష్ణపై చంద్రబాబు కుట్ర: అంబటి రాంబాబు

  • చంద్రబాబు అరెస్ట్ కారణంగా మృతి చెందినవారిని పరామర్శిస్తానని బాలకృష్ణ చెప్పాడన్న అంబటి
  • కానీ ఇప్పుడు నారా భువనేశ్వరి పరామర్శిస్తానని చెబుతున్నారని, ఇందులో కుట్ర ఏమిటని నిలదీత
  • నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకొని పక్కన పెట్టేస్తున్నాడని ఆరోపణ
  • చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారన్న అంబటి
Ambati Rambabu says chandrababu conspiracy on balakrishna

రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి నుంచే కుట్రలు చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొలుత తాను పరామర్శకు వెళ్తానని ప్రకటించారని, కానీ ఇప్పుడు తన సతీమణి భువనేశ్వరి ఎందుకు పరామర్శకు వెళ్తానని చెప్పారు? అని ప్రశ్నించారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదా? అని నిలదీశారు.

గురువారం అంబటి మీడియాతో మాట్లాడుతూ... తనకు చాలా విచిత్రంగా అనిపిస్తోందని, చంద్రబాబు జైల్లో ఉన్నా కుట్రలు చేస్తున్నారన్నారు. ములాఖత్‌లలోనూ కుట్ర చేశారన్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందినవారందరినీ తాను పరామర్శిస్తానని బాలకృష్ణ ప్రకటించారని, కానీ ఇప్పుడు భువనేశ్వరి ప్రశ్నించడం ఏమిటన్నారు. ఇది ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా? అన్నారు. బాలకృష్ణ పలకరించడం మొదలు పెడితే నారావారి నుంచి పార్టీ పోతుందని భయపడినట్లు ఉన్నారన్నారు.

నందమూరి వారి మీద నారావారి కుట్రలు కనిపిస్తున్నాయన్నారు. బాలకృష్ణ అయితే అమాయకుడు కాబట్టి చంద్రబాబు కుట్రలకు సర్దుకుంటారన్నారు. కానీ ఇదివరకు తాను పరామర్శిస్తానని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. ఆయనను ఆపేసి, భువనేశ్వరిని పంపించడం వెనుక కుట్ర ఏం దాగి ఉంది? అని నిలదీశారు. ఎన్టీఆర్ నుంచి మొదలు అన్నీ కుట్రలే అన్నారు.

హరికృష్ణ ఉన్నప్పుడు ఆయనను చంద్రబాబు ఉపయోగించుకున్నారని, ఆయన గెలిచి, మంత్రి అయ్యాక ఆ తర్వాత పక్కన పెట్టారన్నారు. ఇలా నందమూరి కుటుంబాన్ని అవసరానికి ఉపయోగించుకుంటాడని ఆరోపించారు. నిజం ఎప్పుడూ నిప్పులాంటిదని, చంద్రబాబు కుట్రలు బయటకు వస్తున్నాయన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని ప్రచారం చేస్తున్నారని, కానీ అదంతా వట్టిదే అన్నారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప ఆయన ఆరోగ్యం చెడిపోలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని చూపించి ప్రజల్లో సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నారు. ఇన్ని రోజులుగా ఆయనకు కోర్టులలో బెయిల్ రాలేదంటే కచ్చితమైన ఆధారాలతో చిక్కినట్లేనని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News