World Cup: ఈసారి సంచలనమేమీ లేదు... న్యూజిలాండే గెలిచింది!

New Zealand crumbled Afghanistan by 149 runs
  • ఇటీవల ఇంగ్లండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
  • ఇవాళ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఢీ
  • 149 పరుగులతో చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్
  • 289 పరుగుల ఛేదనలో ఆఫ్ఘన్ 139 ఆలౌట్

వరల్డ్ కప్ లో మొన్న ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్ ఇవాళ న్యూజిలాండ్ తో తలపడగా, ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ ను ఓడించిన ఊపులోనే ఆఫ్ఘనిస్థాన్... న్యూజిలాండ్ కు కూడా ఓటమి రుచి చూపిస్తుందా...? అంటూ చర్చ జరిగింది. 

కానీ ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. న్యూజిలాండ్ జట్టు ఘనంగా గెలిచింది. ఎన్నో ఆశలతో ఈ మ్యాచ్ బరిలో దిగిన ఆఫ్ఘన్లు 149 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. 

ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే, ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళుతున్నట్టు అనిపించలేదు. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఆఫ్ఘన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 

కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. శాంట్నర్ కు 3, బౌల్ట్ కు 2, మాట్ హెన్రీ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. ఆఫ్ఘన్ జట్టులో రహ్మత్ షా 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 27, వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ 19 పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరగడం ఆఫ్ఘనిస్థాన్ ఛేజింగ్ ను ప్రభావితం చేసింది.

  • Loading...

More Telugu News