Pakistan: బీసీసీఐపై పాక్ జట్టు డైరెక్టర్ ఆరోపణలు.. స్పందించిన ఐసీసీ

ICC response to Pakistan team director Mickey Arthur controversial Not World Cup but BCCI event remark
  • ఐసీసీ ఈవెంట్ మాదిరిగా లేదన్న పీసీబీ డైరెక్టర్ ఆర్థర్
  • పాక్ మ్యూజిక్ ప్లే చేయలేదని ఆరోపణలు
  • ఇలాంటివి సాధారణమేనన్న ఐసీసీ చైర్మన్
ప్రపంచకప్ 2023 నిర్వహణపై పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మైక్ ఆర్థర్ ఆరోపణలు గుర్తుండే ఉంటాయి. ఇది ఐసీసీ టోర్నమెంట్ మాదిరిగా లేదని, బీసీసీఐ కార్యక్రమం మాదిరిగా ఉందంటూ ఆయన ఆరోపించడం తెలిసిందే. దీనిపై ఐసీసీ స్పందించింది. ఈ నెల 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగింది. ఇందులో పాకిస్థాన్ ఘోర ఓటమి తర్వాత దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ఆర్థర్ వేరే అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. 

పాకిస్థాన్ మ్యూజిక్ ను ప్లే చేయలేదని ఆర్థర్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ కాకుండా బీసీసీఐ నిర్వహించిన ద్వైపాక్షిక సిరీస్ మాదిరిగా ఉందన్నారు. అలాగే, పాకిస్థాన్ క్రికెటర్లను అభిమానించే ఫ్యాన్స్ భారత్ కు వచ్చేందుకు వీసాలు మంజూరు చేయలేదన్నారు. పాకిస్థాన్ కోచ్ గ్రాండ్ బ్రాడ్ బర్న్ సైతం అహ్మదాబాద్ లో పిచ్ పరిస్థితులు భారత్ కు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పందించారు. 

ప్రతి కార్యక్రమంలోనూ ఇలాంటి విమర్శలు సర్వ సాధారణమేనని పేర్కొన్నారు. పరిహరించతగిన అంశాలపై దృష్టి సారిస్తామని, మరింత మెరుగ్గా చేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ‘‘ఆరంభంలోనే ఇలాంటివి కనిపిస్తాయి. మొత్తం మీద ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మార్పులకు సంబంధించి మేము తప్పకుండా సమీక్ష చేస్తాం. ప్రపంచకప్ ను ఎలా మెరుగ్గా మార్చవచ్చన్నది సమీక్షిస్తాం. అయినా, ఇది అద్భుతమైన ప్రపంచకప్ అవుతుందన్న దానిపై సంతృప్తిగా ఉన్నాం’’ అని గ్రెగ్ బార్క్లే చెప్పారు.
Pakistan
team director
Mickey Arthur
controversial comments
ICC
response

More Telugu News