KA Paul: రేవంత్‌ కు ఇచ్చినట్లు రూ.50 కోట్లు అవసరం లేదు... మా పార్టీ టికెట్ కోసం రూ.10 వేలు చాలు: కేఏ పాల్

KA Paula asks people to support Praja Shanthi party
  • ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టోతో వస్తోందని విమర్శ
  • అన్ని కులాలు, మతాలు కలిసి ఎన్నికలను వన్ సైడెడ్ చేయాలని పిలుపు
  • పోటీ చేయాలనుకునే వారు రూ.10,000, రెజ్యుమే పంపించాలని సూచన
  • తాను గెలిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గసీమగా మారుస్తానన్న కేఏ పాల్
బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తోందని, ప్రజలు వారి మాటలు నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ జంటనగరాల్లోని తుకారాం గేట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాట తప్పిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కులాలు, మతాలు కలిసి ఈ ఎన్నికలను వన్ సైడెడ్ చేద్దామని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందామని, ఇందుకు ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.

తమ ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వారు... రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా రూ.10 కోట్లు, రూ.50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10వేలు మాత్రమే గూగుల్ పే లేదా ఫోన్ పే చేసి, రెజ్యుమే పెట్టాలన్నారు. అప్పుడు తమ కోర్ కమిటీ వచ్చి వారిని కలుస్తుందని చెప్పారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున ఆలస్యం చేయవద్దన్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు కార్యాలయానికి వచ్చి కూడా సంప్రదించవచ్చునని చెప్పారు.

తాను ప్రజాశాంతి పార్టీ తరఫునే పోటీ చేస్తానని, తాను ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌లోనూ నిలబడమని చెబుతున్నారని, తమది గుర్తింపు కలిగిన పార్టీ కాబట్టి ఈసీ సింబల్ ఇచ్చాక ప్రకటిస్తానని తెలిపారు. తనను సికింద్రాబాద్ నుంచి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని స్వర్గసీమగా చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు.

తాను గెలిచాక విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి సికింద్రాబాద్‌ను స్వర్గంగా మార్చి, 200 దేశాల్లోని వారు ఇక్కడకు వచ్చి చూసేలా చేస్తానన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గెలిచి ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. అర్హత ఉన్నవారికి ఇవ్వలేదు కానీ ఇప్పుడు పెన్షన్ డబుల్ చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. తన మేనిఫెస్టోను కాపీ కొట్టినట్లు పబ్లిక్ టాక్ ఉందన్నారు.
KA Paul
Telangana
Telangana Assembly Election

More Telugu News