ICC ODI World Cup: భారత్-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్: క్రికెట్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరుతున్న అభిమానులు.. అహ్మదాబాద్‌లో కిక్కిరిసిపోతున్న దవాఖానలు

India Pak Match In Ahmedabad Fans Rushed To Hospitals
  • రేపు భారత్-పాక్ మధ్య మ్యాచ్
  • చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అహ్మదాబాద్‌కు అభిమానుల క్యూ
  • నిండిపోయిన లాడ్జీలు
  • ఆరోగ్య పరీక్షల పేరుతో ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకుంటున్న అభిమానులు
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ మజానా వేరు. అది ఏ స్థాయిలో జరిగినా.. ఎక్కడ జరిగినా సరే. ఇక ప్రపంచకప్ లాంటి బిగ్ టోర్నీ గురించి అయితే చెప్పాల్సిన పనేలేదు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రత్యక్షంగా వీక్షించేందుకు తహతహలాడే ప్రేక్షకులు ఎందరో. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (శనివారం) అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌ను కళ్లారా చూడాలని భావిస్తున్న అభిమానులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు.

అభిమానులతో ఇప్పటికే హోటళ్లు, లాడ్జీలు నిండిపోవడంతో.. ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదన్న లక్ష్యంతో స్థానిక ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ ఇప్పుడు రోగులకు బదులుగా క్రికెట్ ఫీవర్‌తో బాధపడుతున్న వారితో నిండిపోయాయి. 

ఇలా చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎప్పటి నుంచే చేయించుకోవాలనుకుంటున్న ఆరోగ్య పరీక్షలు పూర్తికావడంతోపాటు మ్యాచ్‌ను చూసేందుకు కూడా మార్గం సుగమం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులతో స్థానిక ఆసుపత్రులకు ఆదాయం బాగానే వస్తున్నా.. అసలైన రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కొన్ని ఆసుపత్రులు మాత్రం క్రికెట్ అభిమానులకు ప్యాకేజీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయట.
ICC ODI World Cup
India
Pakistan
Ahmedabad
Cricket Fever

More Telugu News