Australia: వరల్డ్ కప్ లో ఆసీస్ మళ్లీ ఓడింది... ఇవాళ మరీ ఘోర పరాజయం

  • ఆసీస్ కు వరల్డ్ కప్ లో వరుసగా రెండో ఓటమి
  • తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన ఆసీస్
  • ఇవాళ దక్షిణాఫ్రికా చేతిలో 134 పరుగుల తేడాతో పరాజయం
  • 312 పరుగుల లక్ష్యఛేదనలో 177 పరుగులకే కుప్పకూలిన కంగారూలు
Australia loses again in world cup

ప్రపంచంలో ఏ మూలన వరల్డ్ కప్ జరిపినా ఆస్ట్రేలియా జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం భారత గడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలోనూ ఆసీస్ అదే ట్యాగ్ లైన్ తో ప్రస్థానం ఆరంభించింది. కానీ అనూహ్య రీతిలో వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. 

తొలుత భారత్ పై గెలిచే మ్యాచ్ ను చేజార్చుకున్న ఆసీస్... ఇవాళ దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 134 పరుగుల భారీ తేడాతో కంగారూలను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. సఫారీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ (109) సెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనలో ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. 

70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను మార్నస్ లబుషేన్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. లబుషేన్ చేసిన 46 పరుగులే కంగారూ ఇన్నింగ్స్ లో అత్యధికం. లోయరార్డర్ లో మిచెల్ స్టార్క్ 27, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేసినా, అవి ఏమాత్రం సరిపోలేదు. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (7), డేవిడ్ వార్నర్ (13) విఫలం కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బతీసింది. 

ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ సైతం 19 పరుగులకే వెనుదిరగడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోష్ ఇంగ్లిస్ (5), ఆల్ రౌండర్లు గ్లెన్ మ్యాక్స్ వెల్ (3), మార్కస్ స్టొయినిస్ (5) చెత్తగా ఆడి అవుటయ్యారు.

రబాడా, ఎంగిడి, యాన్సెన్ లతో కూడిన సఫారీ పేస్ త్రయం, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షంసీలతో కూడిన స్పిన్ ద్వయం ఆసీస్ ను ఎక్కడా కుదురుకోనివ్వలేదు. క్రమంగా తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్ పై ఒత్తిడి పెంచారు. రబాడా 3, యాన్సెన్ 2, కేశవ్ మహరాజ్ 2, షంసీ 2, ఎంగిడి 1 వికెట్ తీశారు. 

కాగా, వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో సఫారీలు శ్రీలంకను ఓడించారు. అందులోనూ 102 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం. ఇవాళ ఆసీస్ పై అంతకుమించిన తేడాతో గెలవడంతో సఫారీల నెట్ రన్ రేట్ ( 2.360) అమాంతం పెరిగింది. ప్రస్తుతం వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి ఎగబాకింది.

More Telugu News