Ketham Reddy: నారాయణకు టీడీపీ టికెట్ నేపథ్యంలో.. నెల్లూరు సిటీ కీలకనేత కేతంరెడ్డి జనసేనకు రాజీనామా

  • గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి జనసేన తరపున పోటీ చేసిన కేతంరెడ్డి
  • పార్టీలో అవమానాలకు గురవుతున్నానని ఆవేదన
  • కేతంరెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం
Ketham Reddy Vinod Reddy resigns to Janasena as TDP announces ticket to P Narayana

జనసేన పార్టీకి నెల్లూరు సిటీ కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని తన రాజీనామా లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత కూడా తాను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని, పవన్ కల్యాణ్ సీఎం అయితే, ఆయన పక్కన తాను ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుందని తాను భావించానని చెప్పారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అనే నినాదంతో 316 రోజుల పాటు తన నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా వదలకుండా 'పవనన్న ప్రజాబాట' కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. పార్టీలో తనకు పదవులు ఇవ్వకపోయినా, పార్టీ కార్యక్రమాలకు పిలవకపోయినా, తనకు అవమానాలు ఎదురవుతున్నా భరించానని చెప్పారు. 


జనసేనతో పొత్తుకు ముందే మాజీ మంత్రి పి. నారాయణను నెల్లూరు సిటీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిందని... పొత్తు లేకపోయినా పార్టీలోని కొందరు పెద్దలు తనను పిలిచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నారాయణ కోసం మనం పని చేయాలని చెప్పారని కేతంరెడ్డి చెప్పారు. నారాయణ అక్రమాలపై 2016లోనే తాను పోరాటం చేశానని, 2019 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా పోటీ చేశానని... అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించానని తెలిపారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అవమానాలను భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు, తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు ఆయన వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. 
Image
 Image

More Telugu News