Foods: కిడ్నీ సమస్యలు ఉంటే వీటికి దూరం కావడం మంచిది..!

Foods that you should not consume if you have kidney related issues
  • కిడ్నీలపై కొన్ని పదార్థాలతో అధిక భారం
  • ప్రాసెస్డ్ మీట్, పచ్చళ్లు, డ్రింక్స్ ను తీసుకోకపోవడమే మంచిది
  • పాలకూర, టమాటా తక్కువగా తీసుకోవాలి
మన శరీర క్రియల్లో ముఖ్య పాత్ర పోషించే వాటిల్లో మూత్ర పిండాల గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రక్తంలో ఉన్న వ్యర్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు బయటకు పంపిస్తుంటాయి. రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంటాయి. కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఆహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ఎంతో అవసరం. కొన్ని పదార్థాలు మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపుతాయి. కనుక ఏవి తినకూడదన్నది తెలుసుకుని ఉండాలి. 

ప్రాసెస్డ్ మీట్
ఇందులో ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ప్రిజర్వేటివ్ లు కూడా ఉంటాయి. మోతాదుకు మించి వీటిని తీసుకున్నప్పుడు, తరచుగా తీసుకున్నప్పుడు కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. మీట్ లో ఉండే ప్రొటీన్ కూడా కిడ్నీలపై భారాన్ని మోపుతుంది. మీట్ కారణంగా రక్తంలోకి చేరిన ప్రొటీన్ వల్ల కిడ్నీలపై భారం పడుతుంది.

పచ్చళ్లు
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు పచ్ఛళ్లను (నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు) పూర్తిగా పక్కన పెట్టేయాలి. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలను ఎదుర్కొనే వారు సోడియం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

అరటి పండ్లు
అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ. కనుక కిడ్నీ సమస్యలున్న వారు దీన్ని తినకూడదు. దీనికి బదులు పైనాపిల్ తీసుకోవచ్చు.

బంగాళాదుంప
ఆలుగడ్డల్లోనూ పొటాషియం ఎక్కువే ఉంటుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి వాడుకోవచ్చు. దీనివల్ల వాటిల్లో పొటాషియం తగ్గుతుంది. అప్పటికీ పొటాషియం కొంత మిగిలే ఉంటుంది. కనుక ఎప్పుడో ఓ సారి, నానబెట్టి తీసుకోవచ్చు. అలాగే, పొటాషియం అధికంగా ఉండే వాటిని దూరం పెట్టడమే మంచిది. టమాటాలు, ఆరెంజ్ వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. యాపిల్, క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు.

కూల్ డ్రింక్స్
చక్కెరలు కలిపిన సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే రిస్క్ ఉంటుంది. వీటిల్లో ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే, వీటిల్లోని ఫ్రక్టోజ్ కూడా కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది. ఆక్సాలేట్స్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉండే పాలకూర వంటి వాటిని తగ్గించుకోవాలి. 

డైరీ ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
Foods
avoid
kidney problems

More Telugu News