Mohammed Deif: ఇజ్రాయెల్ పై మెరుపు దాడికి కారణం చెప్పిన హమాస్.. అదేంటంటే..!

  • జెరూసలెంలోని మసీదుపై దాడికి ప్రతీకారం కోసమేనని వెల్లడి
  • 2021 మే నెలలో ఆల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ బలగాల దాడి
  • రంజాన్ ప్రార్థనల కోసం వెళ్లిన వారిని బయటకు ఈడ్చిన సైనికులు
Mohammed Deif Is The Hamas mastermind behind brutal attack on Israel

జెరూసలెంలోని ఆల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ బలగాలు వ్యవహరించిన తీరుకు ప్రతీకారంగానే ఇప్పుడు దాడి చేస్తున్నామని పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ ప్రకటించింది. రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్న వారిని సైనికులు మసీదులో నుంచి వెలుపలికి ఈడ్చుకు వచ్చారని ఆరోపించింది. స్త్రీ పురుషులనే తేడా కూడా చూపకుండా విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే తాజాగా ఇజ్రాయెల్ పై మెరుపు దాడికి దిగినట్లు తెలిపింది. కాగా, ఆల్ అక్సా మసీదులో రంజాన్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయని వివరించింది.

ఆ వీడియోలు చూసి హమాస్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహమ్మద్ డెయిఫ్ ప్రతీకార దాడులకు ప్రణాళికలు రచించాడని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి 2021 నుంచే పథక రచన చేపట్టినట్లు వివరించాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లతో విరుచుకుపడడంతో పాటు ఇజ్రాయెల్ లోకి చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించడం వెనక మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ అని అధికారులు చెబుతున్నారు. దీంతో డెయిఫ్ కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వెతుకులాట మొదలుపెట్టాయి.

చాలా ఏళ్లుగా వెతుకుతున్నా దొరకని డెయిఫ్..
హమాస్ దాడుల వెనక కీలక సూత్రధారి మహమ్మద్ డెయిఫ్ కోసం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు చాలా ఏళ్లుగా వెతుకుతున్నారు. అయినా అతడి గురించి తమకు తెలిసింది తక్కువేనని చెప్పారు. ఇప్పటి వరకు డెయిఫ్ ఫొటోలు కేవలం మూడంటే మూడు మాత్రమే లభించాయని వివరించారు. వాటిలో 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటో ఒకటి కాగా, మరో ఫొటోలో డెయిఫ్ ముసుగుతో ఉన్నాడని, ఇక మూడో ఫొటోలో డెయిఫ్ నీడ మాత్రమే ఉందని తెలిపారు. గతంలో పలుమార్లు డెయిఫ్ ను తుదముట్టించే ప్రయత్నాలు చేసినా చివరి క్షణంలో తప్పించుకున్నాడని చెప్పారు. ఓ దాడిలో డెయిఫ్ గాయపడగా.. అతడి కుటుంబం మొత్తం చనిపోయిందని వివరించారు. టెక్నాలజీకి దూరంగా ఉండడంతో డెయిఫ్ ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని తెలిపారు.

  • Loading...

More Telugu News