Israel-Hamas War: ఉగ్రవాది నా దగ్గరే ఉన్నాడు.. ఏ క్షణమైనా కాల్చేస్తాడు.. యుద్ధభూమి నుంచి కుటుంబానికి మెసేజ్ చేసిన 19 ఏళ్ల ఇజ్రాయెల్ యువతి

Israeli Soldier Sends Chilling Texts To Family Before Being Killed By Hamas
  • వెలుగులోకి వస్తున్న గుండెను బరువెక్కించే ఘటనలు
  • తలకు తీవ్రగాయంతో ఉగ్రవాది నుంచి తప్పించుకున్న సైనికురాలు
  • కుటుంబానికి రెండుసార్లు మెసేజ్‌లు 
  • ఆ తర్వాతి నుంచి ఆగిపోయిన సందేశాలు
  • కుటుంబ సభ్యుల ఆందోళన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో కన్నీళ్లు పెట్టించే ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించిన తొలి రోజు ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పై దాడి చేసి పలువురిని చంపేసి ఓ యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. తనను వదిలేయాలని వేడుకున్నా వారు కనికరించలేదు. ఓ కుటుంబాన్ని బందీగా చేసుకున్న మిలిటెంట్లు వారి 18 ఏళ్ల కుమార్తెను వారి కళ్లముందే కాల్చేశారు. అక్క కావాలంటూ తోబుట్టువులు ఏడుస్తున్న వీడియో ప్రపంచంతో కన్నీరు పెట్టించింది. 

తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. 

హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. బాధను అనుభవిస్తూనే అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లోకి వెళ్లిన ఆమె అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. 

‘‘మీ గురించి నేను చాలా చింతిస్తున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది. నాకు దగ్గరల్లోనే ఉగ్రవాది ఉన్నాడు. ఏ క్షణాన్నైనా నన్ను కాల్చేయొచ్చు. ప్రస్తుతం నేను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాను. ఇక్కడ మాకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవు’’ అని ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. 

ఆ తర్వాత కాసేపటికే మరో మెసేజ్ పంపుతూ.. ‘‘ఇక్కడున్న ఉగ్రవాది దూరంగా వెళ్లేలా కనిపించడం లేదు. ఎవరో అరుస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. అక్కడ ప్రాణనష్టం బాగా జరిగినట్టు కనిపిస్తోంది’’ అని అందులో పేర్కొంది.  

ఉదయం 7.30 గంటల వరకు బోని నుంచి మెసేజ్‌లు వచ్చాయని, ఆ తర్వాత మాత్రం ఆగిపోయినట్టు బోని బంధువు ఇలూక్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించగా బోని ఆసుపత్రిలో చేరినట్టు తెలిసినా ఆమె పరిస్థితి గురించి మాత్రం తెలియరాలేదు. ఆమె బతికే ఉందని భావిస్తున్నట్టు వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బోనీ ఏడు నెలల క్రితమే సైన్యంలో చేరారు.
Israel-Hamas War
Hamas Militant
Israel Soldier
Corporal Naama Boni

More Telugu News