Anganwadi center: అంగన్‌వాడీలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం!

Pregnant woman finds dead snake in food supplied by anganwadi center in Chittoor
  • చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన
  • పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూస్తే పాము కళేబరం కనిపించడంతో గర్భిణికి షాక్
  • అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలి ఫిర్యాదు
  • ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామన్న సీడీపీఓ
  • బాధితురాలికి మరో ప్యాకెట్ ఇవ్వాలంటూ గుత్తేదారును ఆదేశించామని వెల్లడి
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం చిత్తూరు జిల్లాలో కలకలానికి దారితీసింది. బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

మానస అనే గర్భిణి.. ఆ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని సీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా, ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు చెప్పామని, మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా గుత్తేదారును ఆదేశించామని పేర్కొన్నారు.
Anganwadi center
Chittoor District
Andhra Pradesh

More Telugu News