Krishna River Water: కృష్ణా జలాల వినియోగం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ... వివరాలు ఇవిగో!

Supreme Court takes up AP govt petition on Krishna river waters
  • విద్యుదుత్పత్తి కోసం కృష్ణా నదీ జలాల విడుదల
  • 2021లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్
  • విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం
  • వారంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, కేఆర్ఎంబీకి సుప్రీం ఆదేశాలు
కృష్ణా జలాల వినియోగం అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 

కృష్ణా నదీ జలాలపై ఏపీ ప్రభుత్వం 2021లో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు విడుదల చేయడాన్ని ఆపాలని ఏపీ సర్కారు తన పిటిషన్ లో పేర్కొంది. 

ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ పై ఇప్పటికే కౌంటర్ వేశామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది కౌంటర్ వేయడానికి వారం సమయం కోరారు. 

ఈ వ్యవహారంలో కేంద్రం, కేఆర్ఎంబీ కౌంటర్లు వేసిన తర్వాత, మరో రెండు వారాల్లో రిజాయిండర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం పిటిషన్ పై తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.
Krishna River Water
AP Govt
Supreme Court
Telangana
KRMB

More Telugu News