Bonda Uma: దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్, పేదవాడి ముసుగు వేసుకుంటున్నాడు: బోండా ఉమ

  • వై ఏపీ నీడ్స్‌ జగన్ కు టీడీపీ కౌంటర్ ఏపీ హేట్స్ జగన్
  • ప్రజలంతా జగన్‌ను వద్దు బాబోయ్ అంటున్నారన్న బోండా ఉమ
  • రూ.7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణ
  • సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతీ సిమెంట్స్ ఎవరివి? అని నిలదీసిన బోండా ఉమ
Bonda Uma fires at YS Jaganmohan Reddy

రాష్ట్ర ప్రజలు 'ఏపీ హేట్స్ జగన్' అంటున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ ప్రచారానికి సిద్ధమవుతుండగా, టీడీపీ ఏపీ హేట్స్ జగన్ పేరుతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం ఉమా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. వైసీపీ చెబుతున్నట్లుగా ఏపీ నీడ్స్ జగన్ కాదని, ఏపీ హేట్స్ జగన్ అని చురక అంటించారు. ప్రజలంతా జగన్ వద్దు బాబోయ్ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు.

వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ అన్నీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్ మూడు రాజధానులు కడతారా? అని నిలదీశారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10 నుంచి 15 మందికి మాత్రమే దక్కినట్లు చెప్పారు. రూ.10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కనీసం రూ.7 లక్షల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వైద్య, విద్యా రంగాలను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. నిన్న జగన్ మాట్లాడుతూ తాను పేదవాడిని, తనకు ఏమీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రుల్లో జగన్ మొదటిస్థానంలో ఉన్నారని ఏడీఆర్ సర్వే చెప్పలేదా? అని ప్రశ్నించారు. అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ పేదలను, ప్రజల్ని మాయచేసి ఓటు వేయించుకోవడానికి ఈ రోజు తాను పేదవాడు అనే ముసుగు వేసుకోవాలని చూస్తున్నాడన్నారు. సాక్షి పేపర్, టీవీ, భారతీ సిమెంట్స్.. ఇవన్నీ ఎవరివని నిలదీశారు.

సర్వనాశనం చేసిన జగన్ ఇంకా ఎందుకు? అని ప్రజలు అడుగుతున్నారని గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో నిలదీస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకుంటున్నందునే ఏం చేయలేక బస్సుయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకున్న జగన్ దళిత పక్షపాతి ఎలా అవుతారని నిలదీశారు. దేశం మొత్తంలోనే 600 హామీలు ఇచ్చి, ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుకెక్కారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రాకముందు దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్, నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారన్నారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం కారణంగా లక్షమందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీ జే బ్రాండ్ మద్యం కొనలేక పేదవాడి జేబు ఖాళీ అయిందన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని వర్గాల యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారన్నారు. నీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో కియా, అమరరాజా, సెల్ కాన్, లూలూ సహా పలు ఐటీ పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయన్నారు. నీ పరిపాలన చూసి ఈ కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయన్నారు.

More Telugu News