Israel: హమాస్ ను తుదముట్టించేందుకు 3 లక్షల మంది రిజర్వ్ సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్

Israel deploys 3 lakh reserve force soldiers to battle on Hamas
  • గత మూడ్రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ బలగాల మధ్య భీకరపోరాటం
  • 800 మంది వరకు ఇజ్రాయెలీల మృతి
  • హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
  • గాజా స్ట్రిప్ లోనూ భారీగా ప్రాణనష్టం
  • భారీ ఎత్తున భూతల యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన

గత మూడ్రోజులుగా ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేపట్టిన భయానక దాడుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలను వెతికి మరీ నేలమట్టం చేస్తోంది. 

అయితే, పౌర నివాస సముదాయాల నడుమ ఉన్న హమాస్ స్థావరాలపై వైమానిక, క్షిపణి దాడులు దాడి చేయడం వల్ల సాధారణ పౌరులు బలవుతుండడంతో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున భూతల యుద్ధం చేపట్టడం ద్వారా హమాస్ ను తుదముట్టించాలని భావిస్తోంది. అందుకోసం 3 లక్షల మంది రిజర్వ్ సైనికులను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్ లో ఉన్న సాధారణ పౌరులు తమ నివాసాల నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.  

అటు, ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా తన విమాన వాహక నౌకను రంగంలో దింపడం పట్ల రష్యా స్పందించింది. ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంలో 'మూడో పక్షం' జోక్యం చేసుకోవడం 'అత్యంత ప్రమాదకరం' అని అభివర్ణించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి సైనిక చర్య మార్గం కాబోదని పేర్కొన్నారు. 

హమాస్ కు బాహాటంగా మద్దతు పలికిన లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా... ఇజ్రాయెల్ లో తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేసింది. 

హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెలీల సంఖ్య 800కి పెరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో గాజా స్ట్రిప్ లో మరణించినవారి సంఖ్య 560కి పెరిగింది. హమాస్ దాడుల్లో తమ దేశానికి చెందినవారు 9 మంది మృతి చెందారని, మరికొందరు ఆచూకీ లేకుండాపోయారని అమెరికా వెల్లడించింది. 

ఇజ్రాయెల్ కు చెందిన మహిళలు, బాలలను కూడా హమాస్ మిలిటెంట్లు చెరబట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం నుంచి మధ్యవర్తులు రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. బందీల పరస్పర మార్పిడికి హమాస్ చర్యలు తీసుకోవాలని ఖతార్ మధ్యవర్తులు పిలుపునిచ్చారు. 

బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీలను విడిచిపెట్టడం ద్వారా, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనా మహిళలు, చిన్నారులను హమాస్ విడిపించుకోవాలని ఖతార్ మధ్యవర్తులు హమాస్ పెద్దలకు సూచించారు.

  • Loading...

More Telugu News