Girl: బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని తల్లికి విషమిచ్చిన టీనేజ్ అమ్మాయి

Girl gives poison to mother after she refused to meet her boyfriend
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఓ అబ్బాయితో చనువుగా ఉంటున్న కుమార్తె
  • మందలించిన తల్లి
  • తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించిన కుమార్తె
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు అడ్డుపడుతోందన్న కారణంతో ఓ టీనేజ్ అమ్మాయి తల్లికి విషమిచ్చింది. 

రాయ్ బరేలీలో నివసించే సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన సంగీతా యాదవ్... కుమార్తెను మందలించింది. ఆ అబ్బాయిను కలుసుకోవద్దని ఆంక్షలు విధించింది. దాంతో కుమార్తె తల్లిపై కోపం పెంచుకుంది. 

బాయ్ ఫ్రెండ్ కు, తనకు మధ్య తల్లి అడ్డుగా ఉందని భావించి తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లిని అడ్డుతొలగించుకోవాలని పథక రచన చేసింది. మార్కెట్ నుంచి విషం తీసుకుని రావాలని తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పింది. తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది. 

ఆ టీ తాగిన సంగీతా యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే, ఈ పరిణామంతో భయపడిపోయిన కుమార్తె పొరుగువారికి విషయం చెప్పింది. దాంతో వారు సంగీతా యాదవ్ ను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పులేదని పోలీసులు తెలిపారు. 

ఈ వ్యవహారంలో పోలీసులు టీనేజ్ అమ్మాయి, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.
Girl
Mother
Poison
Boyfriend
Rae Bareli
Uttar Pradesh

More Telugu News