Hamas Militants: మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి.. విచక్షణారహితంగా కాల్పులు

Hamas Militants Land At Rave Party Using Paragliders In Israel
  • గాజా సరిహద్దుల్లో ఆల్ నైట్ మ్యూజిక్ పార్టీ
  • సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న ఇజ్రాయెల్ పౌరులు
  • ఆకాశంలో నుంచి పారాచూట్లతో దిగి వారిపై మిలిటెంట్ల కాల్పులు
ఇజ్రాయెల్ పై శనివారం రాకెట్లతో విరుచుకు పడ్డ హమాస్ మిలిటెంట్లు.. బార్డర్ లో జరుగుతున్న ఓ మ్యూజికల్ పార్టీపైనా తూటాల వర్షం కురిపించారు. పారాచూట్లతో బార్డర్ దాటి పార్టీ జరుగుతున్న చోట ల్యాండయ్యారు. గాలిలో ఉండగానే కాల్పులు ప్రారంభించి, నేలపై దిగాక విచక్షణారహితంగా బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు తమ తుపాకులకు బలిచ్చారు. చుట్టూ ఖాళీ జాగానే ఉండడంతో తలదాచుకునేందుకు చోటులేక ఇజ్రాయెల్ పౌరులు నిస్సహాయంగా మృత్యువాత పడ్డారు. కొంతమంది పరుగెత్తుకెళ్లి కార్లలో దాక్కున్నా మిలిటెంట్లు విడిచిపెట్టలేదు. కార్లన్నీ వెతుకుతూ మరీ కాల్పులు జరిపారు.

సుక్కోట్ సెలవుల సందర్భంగా గాజా బార్డర్ లోని పొలాల్లో ఆల్ నైట్ మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు. సెలవుల నేపథ్యంలో ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో పౌరులు హాజరయ్యారు. పార్టీలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ, తింటూ తాగుతూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా ఆకాశం నుంచి హమాస్ మిలిటెంట్లు పారాచూట్లతో అక్కడ ల్యాండయ్యారు. మిలిటెంట్లు కాల్పులు జరపడంతో అక్కడ గందరగోళం నెలకొంది. వారి నుంచి తప్పించుకోవడానికి జనం పరుగులు పెట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. మిలిటెంట్లు వారిని చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.
Hamas Militants
Paragliders
Israel
Musical Night Party

More Telugu News