seethakka: సచివాలయంలోకి అనుమతి లేదని అడ్డుకున్నారు: ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka says police obstructed her at secretiate
  • బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం
  • వివిధ శాఖలకు సంబంధించి పనులపై తాను వస్తే అడ్డుకున్నారన్న సీతక్క
  • సచివాలయం బీఆర్ఎస్ నేతలకేనా? అని ప్రశ్న
నియోజకవర్గ పనుల కోసం తాను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయం ప్రధాన ద్వారం ముందు సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారన్నారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, తాను రచ్చ చేయాలి అనుకుంటే చేయగలను.. కానీ ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారు.

సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురక అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్‌మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
seethakka
Congress

More Telugu News