Bandi Sanjay: తెలంగాణ మీ కుటుంబమైతే దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు..? : బండి సంజయ్

  • మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన బీజేపీ సీనియర్ నేత
  • బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయే అవకాశం ఉందని వెల్లడి
  • కేటీఆర్ సీఎం అయితే తెలంగాణ ప్రజలు సహించలేరని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay Press meet

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారనే విషయం బయటపడడంతో అధికార పార్టీలో వివాదం మొదలైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే భరించలేకపోతున్నాం.. ఇక ఆయన తోకలో నుంచి వచ్చిన కేటీఆర్ ను భరించడం మావల్ల అవుతుందా అని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్లు చేస్తున్నారని వివరించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కాదు.. చేయాలనే ప్రయత్నం చేసినా సరే బీఆర్ఎస్ ముక్కలైపోతుందని చెప్పారు. కేటీఆర్ వాడే భాష, ఆయన ఉపయోగించే మాటలు ఆ పార్టీ నాయకులు భరించలేకపోతున్నారని వివరించారు.

తెలంగాణే మా కుటుంబం అని చెబుతున్న కేటీఆర్.. ఓ దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కుటుంబంలో పదవి ఎవరికి ఇస్తే ఏంటనే ఉద్దేశంతో దళితుడిని సీఎం సీటులో ఎందుకు కూర్చోబెట్టలేదని నిలదీశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే బాగుపడ్డారని, వారికోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లు ఉందని బండి మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఉన్న ప్రజాదరణ మొన్నటి సభతో స్పష్టమైందని, ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని.. రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత ఆ కుటుంబం ఆస్తులు ఎన్ని? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఆస్తుల గురించి ఆలోచించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయని కుటుంబానికి ఇన్ని వందల, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగిన ఎన్నికలకు పంచడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. బీజేపీని దెబ్బతీయడానికి దేశవ్యాప్తంగా కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడని ఓ సీనియర్ పాత్రికేయుడే చెప్పారు. దానిపై చర్చ జరగకుండా కొంతమంది జర్నలిస్టులను పక్కకు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ కన్నా పెద్ద చీటర్లు ప్రపంచంలోనే ఎవరూ లేరని విమర్శించారు. గతంలో మంత్రి పదవి కోసం కొడుకు పేరు మార్చిన చరిత్ర కేసీఆర్ దని బండి సంజయ్ మండిపడ్డారు. కల్వకుంట్ల అజయ్ రావు పేరును కేటీఆర్ గా మార్చడానికి కారణం మంత్రి పదవిపై కేసీఆర్ కు ఉన్న ఆశేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News