Roja: బండారు సత్యనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో.. జాతీయ మీడియాకు రోజా ప్రశ్నల వర్షం

Roja question all the National Media outlets over Bandaru comments
  • పురుషాధిక్య సమాజంలో మహిళగా నెగ్గుకు రావడం కష్టమని చెప్పారన్న రోజా
  • నిత్యం కష్టపడ్డానని, ఎన్నికల్లోను రెండుసార్లు ఓడి, ఆ తర్వాత రెండుసార్లు గెలిచానని వ్యాఖ్య  
  • బండారు వంటి కొందరిలో మధ్యయుగం నాటి ఆలోచనలు మారలేదని విమర్శ 
  • బండారు వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ జాతీయ మీడియాకు ప్రశ్న
టీడీపీ నేత బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నేతల వల్ల భవిష్యత్తు స్వప్నాలు నిర్ణయించుకోవడంలో బాలికలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో పురుషాధిక్యం కలిగిన ఈ ప్రపంచంలో పని చేస్తున్నందున మహిళగా నెగ్గుకురావడం చాలా కష్టమని చెప్పారని, స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా తాను అనునిత్యం పనిచేశానని, రెండుసార్లు ఎన్నికల్లో తాను ఓడిపోయినా కసితో పని చేసి ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం వైఎస్ జగన్ తీసుకుంటోన్న మహిళా అనుకూల విధానాలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ తనను మంత్రిని చేశారని గుర్తు చేశారు. మహిళలు ఎంతగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బండారు సత్యనారాయణ వంటి కొంతమంది పురుషులలో మధ్యయుగం నాటి ఆలోచనలు మారలేదని పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారన్నారు.

'ఈ రోజు నేను అన్ని జాతీయ మీడియా ఛానల్స్‌ను ప్రశ్నించాలనుకుంటున్నాను, బండారు వంటి వ్యక్తులను మీరు సమర్థిస్తారా? మరి అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు మీ ఆక్రోశం, ఆవేశం ఎక్కడకు పోయాయి? బండారు సత్యనారాయణ వంటి పురుషాహంకారులు మహిళలను దుర్భాషలాడటం ద్వారా భవిష్యత్తు కోసం కలలు కనే అమ్మాయిలకు నష్టం చేకూర్చినవారు అవుతారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సీఎన్ఎన్ న్యూస్18, రిపబ్లిక్ టీవీ ఛానళ్లను రోజా ట్యాగ్ చేశారు.
Roja
bandaru satyanarayana
Andhra Pradesh
media

More Telugu News