KTR: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్ళు ఎవరో తెలుస్తుంది: మంత్రి కేటీఆర్

  • చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయన్న కేటీఆర్
  • పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొప్పుల మాత్రం పార్టీతోనే ఉన్నారని కితాబు
  • ఊపిరి ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటానని పదిహేనేళ్ల క్రితమే చెప్పారని వ్యాఖ్య
Minister KTR comments on leaders

చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయని, అలాగే పార్టీ బాగున్నప్పుడు కూడా చాలామంది నేతలు వస్తూనే ఉంటారని, అయితే కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కొప్పుల మాత్రం పార్టీ వెంటే నడిచారన్నారు. తాను ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని పదిహేనేళ్ల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. అన్నట్లుగానే ఆయన నిత్యం తమతోనే ఉన్నారన్నారు.

పసుపు బోర్డు ఇచ్చామని బీజేపీ ఓట్లు అడుగుతోంది.. జాగ్రత్త!

ప‌సుపు బోర్డ్ ఇచ్చాం కాబట్టి తమకు ఓటు వేయాల‌ని బీజేపీ చెబుతోందని, పొర‌పాటున కూడా ఆ పార్టీకి ఓటు వేయవద్దని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బీజేపీ దొంగ పార్టీ, మ‌త‌పిచ్చి పార్టీ, హిందూ-ముస్లిం పంచాయితీలు త‌ప్పా ఇంకో ప‌థ‌కం, ప‌నికొచ్చే ప‌ని చేయ‌డం లేదని ఆరోపించారు. ప్ర‌జ‌ల కోసం, పేద‌ల కోసం ఆలోచించడం లేదన్నారు. సంవ‌త్స‌రానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పిన మోదీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదన్నారు.

జాతిపిత మ‌హాత్మాగాంధీని చంపిన మొట్ట‌మొద‌టి టెర్ర‌రిస్ట్ గాడ్సే అన్నారు. గాడ్సేను ఆరాధించే పార్టీ మ‌నకు అవ‌స‌ర‌మా? అని ప్రశ్నించారు. ఇలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని, ఓటుకు నోటు దొంగ‌ను ఇవాళ పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న న‌క్క‌జిత్తుల కాంగ్రెస్ ఎన్ని మాట‌లు మాట్లాడినా నమ్మవద్దన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు సంబంధం ఉంద‌ని ఇవాళ చాలామంది అంటున్నారని, కానీ మోదీని కేసీఆర్ విమర్శించినంతగా ఎవరూ విమర్శించడం లేదన్నారు. మోదీ ఏం చేశాడని ఆయ‌న‌తో తాము అంటకాగుతామని ప్రశ్నించారు. మోదీ దేవుడ‌ని బండి సంజ‌య్ చెబుతున్నారని, సిలిండ‌ర్ ధ‌ర‌, పెట్రోల్, నిత్యాస‌వ‌రాలు పెంచినందుకా మోదీ దేవుడు? అని ప్ర‌శ్నించారు.

More Telugu News