Chintamaneni Prabhakar: బండారు సత్యనారాయణ మాట్లాడిన దాంట్లో నాకేమీ తప్పు కనిపించడంలేదు: చింతమనేని

Chintamaneni supprts Bandaru Sathyanarayana comments
  • మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారు అరెస్ట్
  • బండారు వ్యాఖ్యలను సమర్థించిన చింతమనేని
  • గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో దారుణ వ్యాఖ్యలు చేశారని వెల్లడి
  • వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీత

ఏపీ మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీడీపీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, బండారుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు పలికారు. బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడిన దాంట్లో తనకేమీ తప్పు కనిపించడంలేదన్నారు. 

గతంలో రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దారుణ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు బండారును తప్పుబడుతున్న వారు అప్పుడేమయ్యారని చింతమనేని ప్రశ్నించారు. పైగా వైసీపీ నేతలు నాడు స్పీకర్ సమక్షంలోనే ఆ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తప్పుగా అనిపించలేదు కానీ, ఇప్పుడు రోజాపై చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపిస్తున్నాయా? అని నిలదీశారు. ముందు, అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలని చింతమనేని డిమాండ్ చేశారు. 

ఈ ప్రభుత్వం పోలీసుల సాయంతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు. చిన్న నేతల నుంచి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేతల వరకు అందరిపైనా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. అందరినీ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News