Rain: టీమిండియా, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

  • గువాహటిలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాని ఆట
Rain delays Team India and England World Cup warm up match

టీమిండియాకు మరోసారి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇవాళ ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. 

ఈ మ్యాచ్ కు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పివేయడంతో ఆట ఆలస్యం కానుంది. 

ఈసారి వరల్డ్ కప్ లో రెండు జట్లు ఫేవరెట్లుగా ఉండడంతో వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ హోరాహోరీ పోరు ఉంటుందని భావిస్తున్నారు. ఇంగ్లండ్ 2019లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను నెగ్గి, డిఫెండింగ్ చాంప్ హోదాలో తాజా వరల్డ్ బరిలో దిగుతోంది. 

టీమిండియా కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉండడం టీమిండియాకు శుభసూచకం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి టాపార్డర్ ఆటగాళ్లు వరల్డ్ కప్ కు ముందే టచ్ లోకి వచ్చేశారు. 

బౌలింగ్ లోనూ భారత్ వనరులు అద్భుతంగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాకు తోడు ఇటీవల ఆసియా కప్ లో సంచలన ప్రదర్శన కనబర్చిన సిరాజ్, సీనియర్ పేసర్ షమీలతో టీమిండియా పేస్ విభాగం ప్రత్యర్థులకు సవాల్ విసరడం ఖాయం. 

స్పిన్ డిపార్ట్ మెంట్లో రవిచంద్రన్ అశ్విన్ చేరికతో కూర్పు సరిగ్గా కుదిరింది. జడేజా లెఫ్టార్మ్ స్పిన్, కుల్దీప్ యాదవ్ చైనామన్ బౌలింగ్, అశ్విన్ ఆఫ్ స్పిన్ తో టీమిండియా బౌలింగ్ వైవిధ్యభరితంగా కనిపిస్తోంది.

More Telugu News