ICC One Day World Cup: ప్రపంచకప్‌లో కామెంటేటర్లు వీళ్లే.. వచ్చేసిన స్టార్ల జాబితా

Star studded panel of commentators for World Cup 2023 revealed
  • 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలు
  • ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు వేదిక కానున్న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం
  • ఈసారి కామెంట్రీ బాక్స్‌లో సందడిచేయనున్న దిగ్గజాలు
వన్డే ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే జట్లన్నీ భారత్ చేరుకున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మనకు బాగా పరిచయం ఉన్న గొంతులు కామెంటరీ వినిపించబోతున్నాయి. ఈ మేరకు కామెంటేటర్ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ.టీవీ ఈవెంట్ కవరేజీలో ప్రీమ్యాచ్ షో, ఇన్నింగ్స్ ఇంటర్వెల్ ప్రోగ్రాం, పోస్ట్ మ్యాచ్ ర్యాప్-అప్ వంటివి ఉంటాయి. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ కవరేజీలో చేరుతారు. వీరికి షేన్ వాట్సన్, లిసా స్టాలేకరే్, రమీజ్ రాజా, రవిశాస్త్రి, అరోన్ ఫించ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్ వంటివారు సపోర్ట్‌గా ఉంటారు.

2019లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను చిరస్మరణీయమైనదిగా అభివర్ణించిన నాసర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్ కూడా కామెంట్రీ బాక్స్‌లో కనిపిస్తారు. వీరితోపాటు అంతర్జాతీ దిగ్గజాలైన వకార్ యూనిస్, షాన్ పొలాక్, అంజుమ్ చోప్రా, మైఖేల్ అర్థర్‌టన్ లైవ్ కామెంట్రీ బాక్స్‌లో సందడి చేయనున్నారు. వీరికి సైమన్ డౌల్, ఎంబంగ్వా, సంజయ్ మంజ్రేకర్, కేటీ మార్టిన్, దినేశ్ కార్తీక్, డిర్క్ నాన్స్, శామ్యూల్ బద్రీ, అథర్ అలీ ఖాన్, రసెల్స్, ఆర్నాల్డ్ వంటి వారు జత కూడుతారు. 

వీరేకాక, హర్షాభోగ్లే, కాస్ నైడూ, మార్క్ నికోలస్, నటాలీ జర్మోనోస్, మార్క్ హోవర్డ్, ఇయాన్ వార్డ్‌లతో సహా పలువురు ఐకాన్‌లు కూడా ఈసారి సందడి చేస్తారు. గత ప్రపంచకప్ విన్నర్, రన్నరప్ అయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 5న వన్డే ప్రపంచకప్ మొదలు కానుంది. నవంబరు 19న ఫైనల్ జరగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.
ICC One Day World Cup
ICC
World Cup Commentators

More Telugu News