Canada: భారత్‌పై సాక్ష్యాలెక్కడ?... ట్రూడోను నిలదీసిన కెనడా భారతీయ సమాజం

Trudeaus Allegations Are Childish says Indian Community In Canada
  • ట్రూడో చెబుతోన్న మాటలన్నీ గాలి బుడగల్లాంటివని విమర్శ
  • కెనడాలో రెండు శాతం వరకు మాత్రమే తీవ్రవాదులు ఉన్నారని వ్యాఖ్య
  • మిగిలిన సిక్కులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం లేదని స్పష్టీకరణ
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై అక్కడి ఇండియన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని వ్యాఖ్యలు చిన్న పిల్లల మాటల్లా ఉన్నాయని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేసింది. 

ఖలిస్థాన్ వేర్పాటువాది హత్య విషయంలో భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు గాలి బుడగల్లాంటివని, కెనడాలో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే తీవ్రవాదులు ఉన్నారని, మిగిలిన సిక్కులకు ఆ ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని భారత కమ్యూనిటీలో సభ్యుడైన అమన్‌దీప్ సింగ్ ఛాబా అన్నారు.

ట్రూడో తాను చేసిన ఆరోపణలకు కచ్ఛితమైన సాక్ష్యాలను అందించాలని డిమాండ్ చేశారు. ట్రూడో చేసిన ఆరోపణలు భారత్, కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీశాయన్నారు. ట్రూడో చర్యలు బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. పెద్ద పెద్ద సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని కూడా అలాగే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

మరో కమ్యూనిటీ మెంబర్ డాక్టర్ రాజ్ జగ్‌పాల్ మాట్లాడుతూ... హిందువులు, సిక్కుల మధ్య కెనడా ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందని, ఓట్ల కోసం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాబట్టి ట్రూడో రాజీనామా అయినా చేయాలి లేదా ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగాలని ఇండో-కెనడియన్ మంజీత్ బిర్ అన్నారు. కెనడాలోని భారత సంతతి ఆందోళనగా ఉందన్నారు. సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Canada
Justin Trudeau
India
bharat

More Telugu News