Nara Bhuvaneswari: సింహంలాంటి చంద్రబాబును జైల్లో పెట్టి ఉండవచ్చు కానీ...: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari says chandrababu will fight for people
  • రాష్ట్రం కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్న
  • ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని వ్యాఖ్య
  • సింహంలా బయటకొచ్చి ప్రజల కోసం మళ్లీ పని చేస్తారన్న భువనేశ్వరి
  • ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదని వ్యాఖ్య
  • జగ్గంపేట నిరసన దీక్షలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి

చంద్రబాబును అనవసరంగా రెచ్చగొడుతున్నారని, సింహంలాగా గర్జించే ఆయనను మీరు జైల్లో పెట్టి ఉండవచ్చు, కానీ ఒకటి మరిచిపోతున్నారని, ఇక నుంచి ప్రజల కోసం మరింత కసిగా పని చేస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నాయకులు చేపట్టిన నిరసనదీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అన్నారు. ప్రజల సొమ్ము కోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. 

చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారని ప్రజలను ఉద్ధేశించి అన్నారు. అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లోనే ఉంచారన్నారు. ఏం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు? అన్నారు. ప్రజల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదని, తమ కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి ఎన్టీఆర్ నీడలో తాను పెరిగానన్నారు. తాను, తన కోడలు బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేదని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు.

మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటే ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుందని, సొమ్ము కోసం కాదు.. మీ కోసం, ప్రజల కోసం తాము వస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2 వేలమంది అనాథ పిల్లలను ఉచితంగా చదివిస్తున్నామని, తమకు ఎన్టీఆర్ చూపించిన మార్గం సేవే అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే తపిస్తుంటారన్నారు. ప్రజలకు ఏం చేద్దామనే దానిపై ఆలోచన చేస్తారన్నారు. రాళ్లు, రప్పలున్న హైదరాబాద్‌ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారన్నారు. కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏమిటని ఆనాడు అందరూ నవ్వారని, కానీ ఇప్పుడు అక్కడ వేలాదిమంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఐటీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడన్నారు.

ఆయనను జైల్లో నిర్బంధించారని, కానీ ఆయన ఎక్కడున్నా కుటుంబం కంటే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టినందుకు బాధగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజులాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారన్నారు. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటం తప్పా? అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లబ్దిపొందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారన్నారు. యువత జీవితాలు మార్చడం తప్పా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుంటే పోలీసులు భయపెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారన్నారు. సెల్ ఫోన్లు కూడా లాక్కున్ని వారి నుంచి సమాచారం తెలుసుకుంటున్నారన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి వీసా కావాలా? ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలకు ఎక్కడికైనా వెళ్లే హక్కుందన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, ఎప్పుడూ బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం బయటకు వచ్చారన్నారు.

మహిళల్లో ఝాన్సీ, దుర్గాదేవి శక్తి ఉందన్నారు. మీ ప్రేమ, అభిమానం చంద్రబాబుకు కొండంత బలమని, ప్రభుత్వం అనవసరంగా రెచ్చగొడుతోందన్నారు. ఆయన సింహంలా బయటకొచ్చి మళ్లీ మీకోసం పని చేస్తాడన్నారు.

  • Loading...

More Telugu News