Nimmala Rama Naidu: ఇల్లు అమ్ముకునే స్థితి నుంచి జగన్ ఫ్యామిలీ రూ.3.30 లక్షల కోట్లకు ఎలా ఎదిగింది?: టీడీపీ నేత రామానాయుడు

  • జగన్ ఆర్థిక ఉగ్రవాది, ధనపిశాచి అని నిప్పులు
  • జగతిలోకి అక్రమంగా పెట్టుబడులు తరలించారని ఆరోపణ 
  • గాలి జనార్దన్ రెడ్డితో కలిసి జగన్ భారీ దోపిడీకి పాల్పడ్డారన్న రామానాయుడు  
  • మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంపై ఆగ్రహం
Ramanaidu asks how ys jagan family earns rs 3 lakh crore

ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది అని, ధనపిశాచి అని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్‌పై ఉన్న కేసులు, పిటిషన్లు, స్టేలపై ఆయన సోమవారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం... ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు ఎలా ఎదిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సంపదను దోచుకోవడంతో జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.

రూ.8 లక్షలతో 2006లో సాక్షి మీడియా గ్రూప్‌ను స్థాపించారని, రూ.10 షేర్‌ను రూ.360కి విక్రయించారన్నారు. సెజ్, గనులు, భూములు, కాంట్రాక్టులు కేటాయించి ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్‌లోకి పెట్టుబడులు తరలించారన్నారు. అదే సమయంలో 2006లో ఎలాంటి పెట్టిబడి లేకుండా భారతీ సిమెంట్స్‌లోకి జగన్ ఎండీగా, చైర్మన్‌గా ఎంపికయ్యారన్నారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి జగన్ భారీ దోపిడీకి పాల్పడ్డారన్నారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందు సంస్థలోకి రూ.70 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్, భారతి, విజయలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో రైతులను బెదిరించి అతితక్కువ ధరకు 15 వందల ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. 2019లో జగన్ కుటుంబం ల్యాండ్, లిక్కర్, మైన్, పోర్ట్స్ తదితర కుంభకోణాల ద్వారా రెండున్నర లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇసుక ద్వారా నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు వసూలు చేశారన్నారు.

మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు అనుమతివ్వకుండా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన రూ.41 వేల కోట్ల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు మళ్లించారని ఆరోపించారు. మద్యం ధరలను పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లుగా మరో రూ.13,500 కోట్లు కొట్టేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక కోసం రూ.300 కోట్లు, ప్రభుత్వ ప్రకటనల ద్వారా రూ.500 కోట్లు దోచిపెట్టారన్నారు. విశాఖలో భూకబ్జాల ద్వారా రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ తన నాలుగేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. విద్యుత్ సంస్థల నుంచి కూడా కమీషన్లు దండుకుంటున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికీ తప్పును చూపించలేకపోయారన్నారు.

More Telugu News