Canada: భారత్ తో బంధం ముఖ్యమే.. కానీ మా సార్వభౌమత్వం మాకు మరింత ముఖ్యం: కెనడా రక్షణ శాఖ మంత్రి

Canada Minister Bill Blair Reaction Amid Row With India
  • నిజ్జర్ హత్యపై స్పందించిన కెనడా రక్షణ మంత్రి
  • ఆరోపణలు నిజమైతే తమ సార్వభౌమత్వానికి భంగం కలిగినట్లేనని వ్యాఖ్య
  • నిష్పాక్షికంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్న బిల్ బ్లెయిర్
భారతదేశంతో సత్సంబంధాలు తమకెంతో ముఖ్యమని కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ పేర్కొన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం కూడా తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై బ్లెయిర్ తొలిసారిగా స్పందించారు. నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్ల పాత్రపై సమాచారం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని బ్లెయిర్ అభిప్రాయపడ్డారు. ఆరోపణలు నిజమని తేలితే కెనడా సార్వభౌమత్వం గురించి తాము ఆలోచించుకోవాల్సి వస్తుందని అన్నారు. నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య సంబంధాలకు సవాల్ గా మారిందని చెప్పారు.

భారత్ పై బహిరంగంగా ఆరోపణలు చేయడానికి ముందు కెనడా ప్రధాని వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా దౌత్యాధికారి డేవిడ్ కోహెన్ పేర్కొన్నారు. ‘ఫైవ్ ఐస్’ భాగస్వామ్య దేశాల నుంచి ఆయనకు సమాచారం అందిందని, ఆ తర్వాతే ట్రూడో ఈ సంచలన ఆరోపణలు చేశారని వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను భారత్ కు చాలా వారాల క్రితమే అందించామని ట్రూడో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదని స్పష్టం చేసింది. రాజకీయ ప్రేరేపిత విద్వేష నేరాలు ఆ దేశంలో సర్వసాధారణమేనని విదేశాంగ శాఖ విమర్శించింది.
Canada
Bill Blair
Defence Minister
Reaction

More Telugu News