హిందూ కెనడియన్లు భయపడుతున్నారు: సొంత ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ
- హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలన్న ఎంపీ చంద్ర ఆర్య
- ఖలిస్థాన్ హింస, ఇందిరా గాంధీ హత్య, గుర్‌పత్వంత్ సింగ్ హెచ్చరికలు
- ఈ మూడింటిని ఉదహరించిన ట్రూడో సొంత పార్టీ ఎంపీ
ఆయన సీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ... ప్రధాని (ట్రూడో) ప్రకటన తర్వాత ఏం జరుగుతుందోనని కెనడాలోని హిందువులు భయపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు కారణాలను చెప్పారు. ఖలిస్థాన్ హింస, చరిత్ర అంతా రక్తపాతమేనని, వీరి కారణంగా పదివేల మంది హిందువులు, సిక్కులు మరణించారన్నారు. 38 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఇండియా వెళ్తున్న ఎయిరిండియా విమానంపై బాంబు దాడి, 9/11కు ముందు జరిగిన అతిపెద్ద విమానయాన ఉగ్రదాడి అని తెలిపారు. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిరిండియాపై దాడి చేసిన ఉగ్రవాదులను ఆరాదించడం వాస్తవమే అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన విధానాన్ని కెనడాలో ఓ ర్యాలీలో శకటంపై ప్రదర్శించారని, ఇది ఖండించదగ్గ అంశమన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి హత్యను, అందుకు సంబరాలు చేసుకోవడాన్ని ఏ దేశం అనుమతిస్తుందో చెప్పాలన్నారు. మరో విషయం ఏమంటే గుర్‌పత్వంత్ సింగ్ వంటి వారు హిందూ కెనడియన్లను కెనడా వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి చాలామంది సిక్కులు, కెనడియన్లు ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతివ్వడం లేదన్నారు.