Motkupally: ఏ పరిస్థితుల్లోనూ చంద్రబాబు తప్పుచేసే వ్యక్తి కాదు: మోత్కుపల్లి

  • మానవత్వంలేని మనిషి అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • భువనేశ్వరి ఉసురు తగులుతుందన్న మోత్కుపల్లి
  • చంద్రబాబును ఇబ్బంది పెడితే నష్టం జగన్ కేనని వెల్లడి
At Any Circumstances Chandrababu Will Never Do Wrong Says Motkupally Narsimhulu

ఓ నియంతలా, సైకోలా వ్యవహరిస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమని బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఆయన పెళ్లి రోజే అరెస్టు చేసి రాక్షసానందం పొందారంటూ మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీస మానవత్వం లేదంటూ మండిపడ్డారు. కక్ష సాధింపునకూ ఓ పద్దతి ఉంటుందని, జగన్ లా దుర్మార్గంగా వ్యవహరించిన వారిని తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తప్పు చేయడని పేర్కొన్నారు. ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటంలేదని అన్నారు. అలాంటి నేత అరెస్టు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి నియంత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే నష్టపోయేది జగనేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు కాదు కదా 4 సీట్లు కూడా రావని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. నారా భువనేశ్వరిని కన్నీళ్లు పెట్టించారని, ఆమె ఉసురు జగన్ కు తప్పకుండా తగులుతుందని అన్నారు.

నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు పోవాల్సిందేనని మోత్కుపల్లి చెప్పారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి తాను పొరపాటు చేశానని, దీనికి ఇప్పుడు తల దించుకుంటున్నానని అన్నారు. ఎవర్ని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని చెప్పారు. అయితే, సీఎం పదవి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని జగన్ కు మోత్కుపల్లి హితవు పలికారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా షర్మిలను బయటకు పంపాడంటూ జగన్ పై మండిపడ్డారు. సొంత బాబాయ్‌ ని చంపిన నేరస్థులనే అరెస్టు చేయలేని అసమర్థుడని మోత్కుపల్లి దుయ్యబట్టారు.



  • Loading...

More Telugu News