TTD: శ్రీవారి బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

TTD electric bus which went missing in Tirumala found in Naidupeta
  • జీపీఎస్ ద్వారా బస్సు ఆచూకీ గుర్తించిన పోలీసులు
  • నాయుడుపేట దగ్గర్లో దొంగ వదిలేసి వెళ్లినట్లు గుర్తింపు
  • బ్యాటరీ చార్జింగ్ అయిపోవడమే కారణమని భావిస్తున్న పోలీసులు
తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మరథా (బస్సు) లను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును గప్ చిప్ గా తీసుకెళ్లాడో దొంగ.. కొండమీద తిరగాల్సిన బస్సు తిరుపతికి వెళుతున్నా అలిపిరి గేటు వద్ద సెక్యూరిటీ పట్టించుకోలేదు. దీంతో ఆ దొంగ దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయిపోగానే బస్సు ఆగిపోయింది.

ఇక చేసేదేంలేక బస్సును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా దొంగ.. డిపోలో ఉండాల్సిన బస్సు మాయం కావడంతో కొండపై అన్నిచోట్లా గాలించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జీపీఎస్ సాయంతో బస్సును ట్రాక్ చేయగా.. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు తేలింది. దీంతో బస్సును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బస్సును ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఓవైపు కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా బస్సు చోరీ విషయం బయటపడడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చోరీకి గురైన బస్సు విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో కొండపై తిప్పేందుకు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో రూ.2 కోట్ల విలువైన ఈ బస్సు రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
TTD
electric bus
missing
Tirumala
found in Naidupeta

More Telugu News