Motkupalli Narsimhulu: చంద్రబాబు అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలి.. రేపు నిరాహారదీక్ష చేస్తున్నా.. భువనేశ్వరిని కలుస్తా: మోత్కుపల్లి

Motkupalli demands KCR to condemn Chandrababu arrest
  • రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ స్పందించాలన్న మోత్కుపల్లి
  • బటన్ ఒత్తి రాజ్యమేలుతానంటాడని జగన్ పై విమర్శలు
  • అవకాశం వస్తే చంద్రబాబును కలుస్తానన్న మోత్కుపల్లి
  • బాబు అరెస్ట్ కు నిరసనగా రేపు నిరాహార దీక్ష చేస్తున్నానని వెల్లడి
  • చంద్రబాబు అరెస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని వ్యాఖ్య
ఒక ప్రజాస్వామ్యవాదిగా చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలని తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా చేశారని... రాజకీయాలను పక్కన పెట్టి అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక మనిషిగా మారాలని చెప్పారు. నేను బటన్ ఒత్తి రాజ్యమేలుతానంటున్నాడని... బటన్ ఒత్తి ఎంత మందికి మేలు చేశాడని ఎద్దేవా చేశారు. గతంలో జైల్లో ఉన్న జగన్ గెలిచాడని, ఇప్పుడు జైల్లో ఉన్న చంద్రబాబు గెలుస్తారని చెప్పారు. ప్రజలు దయగలవారని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఏ ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశావని మోత్కుపల్లి మండిపడ్డారు. రాత్రి పూట ఒక దొంగ మాదిరి పోలీసులు తీసుకెళ్లేంత స్థితిలో చంద్రబాబు ఉన్నారా? ఇలా అరెస్ట్ చేసినందుకు మీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. 

రెండు, మూడు రోజులలో రాజమండ్రికి వెళ్లి నారా భువనేశ్వరిని పరామర్శిస్తానని... ములాఖత్ అవకాశం వస్తే జైల్లో చంద్రబాబును కలుస్తానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తాను రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నానని తెలిపారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పి, తప్పును సరిచేసుకోవాలని జగన్ కు సూచించారు. 

మీటింగుల్లో జగన్ మాట్లాడుతూ నేను మీ బిడ్డను అంటాడని... ఎవరి బిడ్డవు నీవు? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఎస్సీలను చంపుతున్నావు కాబట్టి నీవు ఎస్సీల బిడ్డవు కావు, రాజధానిని చంపేశావు కాబట్టి ప్రజల బిడ్డవు కావు, అమ్మను ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కాబట్టి అమ్మ బిడ్డవు కావు.. ఎవరి బిడ్డవయ్యా నీవు? అని ఎద్దేవా చేశారు. 

జైల్లో దోమలు కుడుతున్నాయని నిన్న వర్చువల్ గా జడ్జికి చంద్రబాబు చెప్పారని... అదే జైల్లో దోమలు కుట్టి, డెంగీ వచ్చి రిమాండ్ ఖైదీ చనిపోయాడని మోత్కుపల్లి చెప్పారు. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే నీవే బాధ్యుడవు అని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఏపీ ప్రజలు నీకు కచ్చితంగా గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. చంద్రబాబును అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని... ఇవేవీ నీకు కనపడటం లేదా, వినపడటం లేదా? అని ప్రశ్నించారు. 

ప్రేమ సమస్తమును గెలుచును అని బైబిల్ లో ఉందని... ఆ ప్రేమతోనే తాను ఆరు సార్లు గెలిచానని చెప్పారు. అందరికీ ముద్దులు పెట్టి మోసం చేశావని జగన్ ను విమర్శించారు. దళితులెవరూ జగన్ కు ఓట్లు వేయరని చెప్పారు. జగన్ పాలనలో ఏపీ నాశనం అయిందని విమర్శించారు.
Motkupalli Narsimhulu
Chandrababu
Telugudesam
KCR
BRS
Jagan
YSRCP

More Telugu News