BRS: పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్..!

Minister KTR Meets with Party senior leaders Muttireddy and Rajaiah
  • ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి 
  • మంత్రి కేటీఆర్ జోక్యంతో సమసిన వివాదం
  • రైతు సమన్వయ సమితి చైర్మన్ గా రాజయ్య
  • అసంతృప్తులను బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ ముఖ్యులు
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం సిట్టింగ్ ల పేర్లు ఉండడంతో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. కొన్నిచోట్ల సిట్టింగ్ లను పక్కన పెట్టడంతో వారిలోనూ అసంతృప్తి రాజుకుంది. ఈ క్రమంలో టికెట్ దక్కని అసంతృప్తులపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. వారు పార్టీని వదిలి వెళ్లకుండా బుజ్జగింపులు మొదలుపెట్టింది.

ప్రధానంగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు మంత్రి కేటీఆర్ ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే జనగామ, ఘన్ పూర్ నేతలతో కేటీఆర్ సంప్రదింపులు జరిపి వారి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈసారి పార్టీ టికెట్ దక్కలేదు.. దీంతో తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న ముత్తిరెడ్డితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా మంచి పదవి కట్టబెడతామని బుజ్జగించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సరే అన్నట్లు తెలుస్తోంది. దీంతో జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. 

మరోవైపు, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం టికెట్ ను ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి పార్టీ కేటాయించిన సంగతి విదితమే. దీంతో ఆగ్రహంగా ఉన్న రాజయ్యను కూల్ చేయడానికి మంత్రి కేటీఆర్ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పదవిని ఆయనకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సమ్మతించిన రాజయ్య.. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
BRS
Telangana
Assembly Elections
party ticket
Muttireddy
MLC Palla
janagama ticket

More Telugu News