Botsa Satyanarayana: చంద్రబాబు దోపిడీ గురించి టీడీపీ ఎమ్మెల్యేలకూ తెలుసు కానీ...: బొత్స

Botsa says tdp mlas aware of chandrababu fraud
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే టీడీపీ పారిపోతోందన్న బొత్స
  • అవినీతి, అక్రమాలు ఎలా జరిగాయో వివరించామని వెల్లడి
  • టీడీపీ కూడా అసెంబ్లీ వేదికగా ఏదైనా చెప్పాలని సూచన
  • చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్కదారి పడతాయని నిలదీత
  • తప్పు చేశారు కాబట్టే క్వాష్ పిటిషన్ కొట్టివేశారని వ్యాఖ్య

అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు గురించి చర్చిద్దామంటే టీడీపీ సభ్యులు పారిపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏకపక్షంగా కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమని కోరినా వారు సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. చర్చకు భయపడి పారిపోతున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి, అక్రమాలు ఎలా జరిగాయో తాము వివరించామన్నారు. అలాంటప్పుడు టీడీపీ కూడా సభలో ఏదైనా చెప్పాలి కదా అన్నారు. చర్చలో పాల్గొనమంటే భయమెందుకన్నారు.

చంద్రబాబు దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. టీడీపీ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసునని, కానీ కావాలనే సభలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్కదారి పడతాయన్నారు. ఏయే షెల్ కంపెనీల ద్వారా డబ్బులు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గుతేల్చిందన్నారు. 

రెండు రోజులుగా టీడీపీ సభాసమయాన్ని వృథా చేస్తోందన్నారు. సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. చర్చలో పాల్గొంటే స్కాం చేసినట్లు దొరికిపోతామని టీడీపీ భయపడుతోందన్నారు. వారు తప్పు చేశారు కాబట్టే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేసిందన్నారు. సీమెన్స్‌తో ప్రభుత్వం ఒప్పందం అంటున్నారని, మరి ఆ నిధులు ఎక్కడకు వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News