Prabhas: ప్రభాస్ ‘కల్కి’ సినిమా విషయంలో వైజయంతి మూవీస్ హెచ్చరిక

Producers issues Copyright Infringement note for Kalki 2898 Ad
  • ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా
  • సెట్స్ నుంచి కొన్ని చిత్రాలు, ప్రభాస్ ఫొటోలు లీక్
  • సోషల్ మీడియాలో షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరిక
టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మహానటితో దర్శకుడిగా తన మార్కు చూపెట్టిన నాగ్‌ అశ్విన్‌ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పి. అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్‌ అగ్రనటి దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల హాసన్‌ వంటి సినీ దిగ్గజాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాంతో సహజంగానే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన టైటిల్ వీడియో గ్లింప్స్ కు అద్భుత స్పందన వచ్చింది. అయితే, సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి  సెట్స్‌ నుంచి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో కూడా లీకైంది. 

దీంతో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లీక్స్ బెడద తప్పించేందుకు కాపీరైట్‌ నోటీసును జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సన్నివేశాలు, మ్యూజిక్, ఫుటేజ్, స్టిల్స్, ఫొటోలు తదితర కాపీరైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు కేవలం నిర్మాణ సంస్థకు మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇతర వ్యక్తులు ఈ సినిమా సీన్లు, ఫొటోలు, ఫుటేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుదని హెచ్చరించింది. కల్కి నుంచి ఏదైనా ఫొటోలు, వీడియోలతో పాటు సమాచారం, న్యూస్ ను లీక్ చేసినా సైబర్‌ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్‌ మీడియాలో విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది.
Prabhas
Kalki 2898 Ad
Copyright
Producers

More Telugu News