Yerramreddy Suryanarayana Reddy: వైఎస్ మాజీ వ్యక్తిగత సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు

Case Against Ex CM YSR Personal Secretary Sureedu In Hyderabad
  • సూరీడు తనపై దాడిచేశారంటూ అల్లుడు సురేందర్‌రెడ్డి ఫిర్యాదు
  • పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించి దాడులు చేశారని కోర్టులో పిటిషన్
  • సూరీడుతోపాటు ఏపీ ఐజీ జి.పాలరాజు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌పైనా కేసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి (సూరీడు)తోపాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరీడు కుమార్తె గంగాభవానీకి కడపకు చెందిన పోతిరెడ్డి సురేంద్రనాథ్‌రెడ్డితో వివాహమైంది. ఆ తర్వాత విభేదాల కారణంగా భర్త సురేంద్రనాథ్‌రెడ్డిపై భార్య వరకట్న వేధింపుల కేసు పెట్టారు. 23 మార్చి 2021న రాత్రి ఏడున్నర గంటల సమయంలో కుమార్తెను చూసేందుకు సురేందర్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని మామ సూరీడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మామా, అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది.  

జూబ్లీహిల్స్ పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తనను అక్రమంగా నిర్బంధించి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత మంగళవారం సురేంద్ర మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి అప్పటి జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేశ్ తనపై దాడిచేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాంగ్మూలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ సురేంద్రనాథ్‌రెడ్డి ఫిర్యాదుపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పాలరాజుపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News