Payyavula Keshav: వైసీపీ ఎక్కడ పుట్టిందో ముఖ్యమంత్రి ఒకసారి గుర్తు చేసుకోవాలి: పయ్యావుల కేశవ్

  • టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
  • అసెంబ్లీ వెలుపల టీడీపీ సభ్యుల ప్రెస్ మీట్
  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన పయ్యావుల కేశవ్
  • సీఎం గతం మర్చిపోయినట్టుందని వ్యాఖ్యలు
Payyavula Keshav slams CM Jagan

నేడు ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సభాపతి సస్పెన్షన్ వేటు   వేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగుల్లో టీడీపీని తిడితే, వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తిడుతున్నారని మండిపడ్డారు. శాసనసభ అంటే వైసీపీ కార్యాలయం అనే భావనలో ఉన్నారని పయ్యావుల ధ్వజమెత్తారు. 

"వీళ్లకు సభలో ఎలా వ్యవహరించాలో తెలియదు... ఎవరైనా చెబితే అభద్రతాభావంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. మేం ఇంకా మాట్లాడితే చివరకు సస్పెన్షన్ వరకు వెళుతున్నారు. పాలకుల విధానం బుల్డోజ్ చేయడమే. ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగుల్లో తెలుగుదేశాన్ని తిడతాడు... అధికారపార్టీ వాళ్లు బయటతిట్టింది చాలక... అసెంబ్లీలో కూడా తిడుతున్నారు. శాసనసభలో ఉన్నామా... బయట పబ్లిక్ మీటింగ్ లో ఉన్నామా అనే ఆలోచన వాళ్లకు ఉండటంలేదు. 

ఆ మాటలు విన్నాక సీఎంకు ఆలోచనా శక్తి తగ్గిందనిపిస్తోంది!


చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్  కలిస్తే దానిపై ముఖ్యమంత్రి ములాఖత్ లో మిలాఖత్  అయ్యారని మాట్లాడారు. ఆ మాటలు విన్నాక ముఖ్యమంత్రికి ఆలోచనా శక్తి తగ్గిందనే అనుమానం కలిగింది. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి గతం గుర్తుచేసుకోవాలి. 

ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు ఎన్ని మిలాఖత్ లు అయ్యాయో తెలియదా? అప్పుడే మర్చిపోయారా? వైసీపీ పుట్టుక మొదలైందే ములాఖత్ లు, మిలాఖత్ లతో కదా! ఆ విషయం మర్చిపోయి ఆయన మాట్లాడితే ఎలా? ఆయన ఢిల్లీ వెళ్లి ఎవరితో ఎప్పుడు ములాఖత్ అయ్యి... మిలాఖత్ లు జరుపుతున్నారో తెలియదా? ఆయనపై ఉన్న కేసుల విచారణ ఆగిపోవడానికి ఏ ములాఖత్ లు... ఏ మిలాఖత్ లు కారణమో ఆయనే చెప్పాలి. 

అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి, బహిరంగసభకు తేడా తెలియకపోతే ఎలా?

వైసీపీ వాళ్లు మాట్లాడే దానికంటే మేం గట్టిగానే పాయింట్లు మాట్లాడగలం. కానీ సమయం ... సందర్భం చూస్తున్నాం. వీళ్లెన్ని చెప్పినా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా రూపాయి కూడా పక్కకు పోలేదు. పక్కకు పోనప్పుడు అది చంద్రబాబుకో, మరొకరికో వచ్చే అవకాశమే లేదు. ఫలానా రూపాయి... ఫలానా దగ్గరకు పోయి... ఫలానా చోటకు చేరిందని ఈ రోజుకి నిరూపించలేకపోయారు. ఒక్కఆధారం బయటపెట్టలేదు. ఎవరైనా ఆధారాలుంటే అరెస్ట్ చేస్తారు... కానీ, అరెస్ట్ చేశాక ఆధారాలు చూపిస్తామని నిస్సిగ్గుగా కోర్టులకు చెప్పడం వీళ్లకే చెల్లింది.

ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే మమ్మల్ని అక్రమంగా సస్పెండ్ చేశారు: నిమ్మల రామానాయుడు

అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరి ప్రవర్తించారని మండిపడ్డారు. 200 మంది మార్షల్స్ తో టీడీపీ సభ్యుల్ని అడ్డుకోవాలని చూసిన ఈ రోజు నిజంగా బ్లాక్ డేనే అని వెల్లడించారు. 

"ఈ ముఖ్యమంత్రి బయటకు రావాలంటే 144 సెక్షన్... 30 యాక్ట్.... ముందస్తు అరెస్ట్ లు ఉంటాయి. పరదాలు, పోలీసుల మాటున బయటకొచ్చే పరిస్థితి. ఇప్పుడు సభలో మార్షల్స్ ను అడ్డంపెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. 

చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులపై, పాలకులు చేస్తున్న నిరాధార ఆరోపణలపై మేం వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని... అందుకు అనుమతించాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాం. నిజంగా వీళ్లకు నీతి నిజాయతీ, చిత్తశుద్ధి  ఉంటే, మాకు ఎందుకు అవకాశమివ్వలేదు? 

చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై మేం ప్రజంటేషన్ ఇస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ప్రభుత్వం ఆయనపై పెట్టిన కేసుల డొల్లతనం ప్రజలకు తెలుస్తుందనే మమ్మల్ని అక్రమంగా సస్పెండ్ చేశారు. ఇలాంటి వాటికి తెలుగుదేశం వెనక్కుతగ్గదు. ఎంతగా అణచివేయాలని చూస్తే, అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం” అని రామానాయుడు తేల్చిచెప్పారు.

More Telugu News