మహిళా బిల్లును ఇప్పుడు ఆమోదించినా 2029 తర్వాతే అమలులోకి..?
- మహిళా బిల్లు ముందు పలు అడ్డంకులు
- నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అమలు అసాధ్యం
- నేడు లోక్ సభలో బిల్లుపై చర్చ.. అనంతరం ఆమోదం తెలిపే అవకాశం
నియోజకవర్గాల పునర్విభజన చేపట్టక ముందు మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యంకాదని, జన గణన చేపట్టకుండా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని అంటున్నారు. నిబంధనల ప్రకారం 2021లో జనగణన చేపట్టాల్సింది.. అయితే, కరోనా మహమ్మారి కారణంగా చేపట్టడం కుదరలేదు. దీంతో తర్వాతి జనగణన 2027లోనేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమని చెబుతున్నాయి.
ఒకవేళ ఆర్టికల్ 82 కు సవరణ చేసి 2027 కంటే ముందే జనగణన చేపట్టినా ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపి అది చట్టంగా మారినా సరే అమలులోకి వచ్చేది మాత్రం 2029లోనేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టంగా మారిన తర్వాత కూడా కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని వివరించారు.